ఘరానా కేటుగాళ్లు.. గూగుల్ మ్యాప్ తో చోరీలకు స్కెచ్.. కుంటివాళ్లుగా నటిస్తూ, ఏమార్చి వందకు పైగా నేరాలు...
అతనికి సొంతంగా ఫోన్ లేదు కానీ.. టెక్నాలజీ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది. పక్కవాళ్ల స్మార్ట్ ఫోన్ లో చూసి గూగుల్ మ్యాప్ సాయంతో చోరీలకు స్కెచ్ వేస్తాడు. పక్కా ప్లాన్ తో అమలు చేసి అందకుండా పోతాడు. చివరికి...
హైదరాబాద్ : చదివింది పదో తరగతే అయినా.. సాంకేతిక పరిజ్ఞానంలో అపారమైన పట్టు సంపాదించాడు. బంధువులతో ముఠా కట్టి గూగుల్ మ్యాప్స్ సహాయంతో చోరీలకు స్కెచ్ వేస్తాడు. అర్ధరాత్రి ఇళ్లల్లోకి దూరి సొత్తు కాజేసి… తప్పించుకునేంత వరకు అనేక రకాల వేషాలు వేయడం వీరి ప్రత్యేకత. ఈ ముఠాలోని ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 44.5 తులాల బంగారం 1.2 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.25,93,820 వస్తుందని అంచనా. నేరేడ్మెట్ రాచకొండ కమిషనరేట్లో సోమవారం మీడియా సమావేశంలో సీపీ భగవత్ వివరాలు వెల్లడించారు.
బెయిల్ పై బయటకొచ్చాక…
దొంగల ముఠా నాయకుడు దాసరి మురళి అలియాస్ బాలు అలియాస్ కృష్ణ (26). స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మునిగెలవీడు గ్రామం. 22 యేళ్ల వయసును మంచి నేరాల బాట పడ్డాడు. ఇతడిపై 37 కేసులు ఉన్నాయి. 12 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. మహబూబాబాదులో ఇతనిపై రెండుసార్లు పీడీ చట్టం ప్రయోగించారు.
2021 ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చాక తండ్రి దాసరి నర్సయ్య, బంధువులు అంగడి సురేష్, అంగడి జంపయ్య, కుతాటి పరమేష్ (28), బిజిలి మల్లయ్య, తోట సారయ్య (38)లతో ముఠాకట్టి చోరీలు ప్రారంభించాడు. కుతాటి పరమేష్ 52 కేసులో నిందితుడు. ఇతడిపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. కేవలం గ్రామీణ ప్రాంతాలు, ఊరికి దూరంగా ఉన్న నివాసాల్లో దోచుకుంటారు.
బస్సులో ప్రయాణం… హ్యాండీక్యాప్డ్ గా నాటకం…
దాసరి మురళి పదోతరగతి చదివాడు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు ఉంది. అతడి పేరుతో మొబైల్ ఫోన్ లేదు. ముఠా సభ్యుల స్మార్ట్ ఫోన్ తో గ్రామాల్లో రహదారికి కాస్త దూరంగా, ముందు ఉన్న గ్రామాలను గూగుల్ మ్యాప్ సహాయంతో ఎంచుకుంటారు. ఆ గ్రామాలకు ముఠాలోని ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు బస్సులో వెడతాకె, ఇళ్లలో దొంగతనాలకు నలుగురు, గొలుసు చోరీలకు ఇద్దరుగా విడిపోతారు. దొంగతనం చేసే ముందు మద్యం తాగుతారు.
ఇంటి వెనక గుమ్మం తలుపులు, కిటికీలు తొలగించి లోపలికి జొరబడతారు. ప్రధాన నిందితుడు మురళి ఇంట్లోకి వెళ్లి సొత్తు దొంగిలిస్తాడు. కుతాటి పరమేష్ ఇంటి బయట కాపలా కాస్తాడు. వేసవి కాలం ఆరుబటయ నిద్రపోతున్న మహిళల మెడలో బంగారు గొలుసులను ఈజీగా కొట్టేస్తారు. సీసీ కెమెరాల ఫుటేజీలో పోలీసులను ఏ మార్చేందుకు దివ్యాంగులుగా నటిస్తారు. కుంటుకుంటూ వెడుతుంటారు. 30 నుంచి 45 నిమిషాల్లో చోరీ చేసి రహదారిపైకి చేరి ప్రైవేటు వాహనాల్లో బయటపడతారు.
నిర్మల్ లో చేసిన దొంగతనంలో వచ్చిన డబ్బుతో మురళి ఫ్లాట్ కొనుగోలు చేశాడు. మరో నిందితుడు ప్రియురాలు వద్ద దాచినట్లు సమాచారం. వందకు పైగా దొంగతనాలకు పాల్పడిన ముఠా తనను ఎదిరించిన బాధితులను బెదిరించడం, కొట్టడం చేయకపోవడం విశేషం. పోలీసులు యాదగిరిగుట్ట సమీపంలోని రాయగిరి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రధాన నిందితుడు దాసరి మురళి, కుతాటి పరమేష్, తోట సారయ్యలు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకున్నారు. సమావేశంలో డీసీపీలు యాదగిరి, నారాయణరెడ్డి, అదనపు డిసిపి లక్ష్మి, ఏసీపీ జీ రవి, ఇన్స్పెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు.