హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్ కౌంటర్లు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 2015 నుంచి 2019 డిసెంబర్ 6న జరిగిన ఎన్ కౌంటర్ వరకు అన్నీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్ కౌంటర్లే కావడం విశేషం. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 2016, 2019 సంవత్సరాల్లో వరుసగా నాలుగు ఎన్ కౌంటర్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లేనే భారీ ఎన్ కౌంటర్ కు తెరలేపారు పోలీసులు. 

2015 ఏప్రిల్ 7న జరిగిన ఎన్ కౌంటర్ తో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైల్ అండ‌ర్ ట్ర‌య‌ల్ గా ఉన్న ఐఎస్ఐ తీవ్ర‌వాది వికారుద్దీన్ ఎన్ కౌంటర్ తో యావత్ దేశంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. 

వరంగల్ జైల్లో ఉన్న వికారుద్దీన్ తోపాటు అతని అనుచ‌రులు అంజ‌ద్, జ‌కీర్, హిజార్ ఖాన్, హనీఫ్ ల‌ను హైద‌రాబాద్ త‌ర‌లిస్తుండ‌గా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు.  పోలీసుల ఆయుధాలు లాక్కున్నారు. వాటితో పోలీసులపై కాల్పులు జ‌రిపేందుకు ప్రయత్నించారు. దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్ తో పాటు ఆయన అనుచరులు దుర్మరణం పాలయ్యారు.  

photo gallery:నిందితుల డెడ్‌బాడీలు... ఎన్‌కౌంటర్‌పై సంబరాలు

ఈ ఘటన వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా జనగామ సమీపంలోని ఐఎస్ సదన్ వద్ద చోటు చేసుకుంది. నిషిద్ధ సిమి సానుభూతి పరుడుగా ఉన్న వికారుద్దీన్ జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా ప్రతీసారి తప్పించుకునే ప్రయత్నం చేసేవాడని పోలీసులు ఆరోపించారు. 

తమపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపినట్లు పోలీసులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. బూటకపు ఎన్ కౌంటర్ అంటూ ఎంఐఎం ఆరోపించిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు అదే ఏడాది 2015 సెప్టెంబ‌ర్ లో వరంగల్ వేదికగా మ‌రో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. వ‌రంగ‌ల్ జిల్లా తాడ్వాయి మండ‌లం వెంగ‌లాపూర్ అట‌వీ ప్రాంతం మొద్దుగుట్టలో గ్రేహౌండ్స్ పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య జరిగిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కి చెందిన శృతి అలియాస్ మ‌హిత(24) , మ‌ణికంఠి విద్యాసాగ‌ర్ రెడ్డి అలియాస్ సూర్యం(33) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

Justice For Disha:ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ వివరణ ఇదీ......

ఇకపోతే శృతి హైద‌రాబాద్ లో ఎంటెక్ చదువుతుండగా ఆమె తండ్రి హైద‌రాబాద్ లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నారు. ఇదే ఎన్ కౌంటర్ లో మృతిచెందిన మరో మావోయిస్టు పార్టీ నేత సూర్యం ధ‌ర్మ సాగ‌ర్ మండ‌లం పెద్ద పెండ్యాల‌కు చెందినవారు. ఇద్దరూ వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. 

శృతి అలియాస్ మహిత చదువుతుండగా విద్యాసాగ‌ర్ రెడ్డి ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దివి ఇంటి వ‌ద్దే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. అయితే వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి.   

ఛత్తీస్ ఘడ్ నుంచి మావోయిస్టుల బృందం వరంగల్ వచ్చిందని పోలీసులకు సమాచారం రావడంతో వరంగల్ మన్యంలో కూంబింగ్ నిర్వహించారు పోలీసులు. ఆ కూంబింగ్ లో శృతి, విద్యాసాగర్ రెడ్డిలపై కాల్పులు జరిపారు. ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

అయితే ఆ ఎన్ కౌంటర్ ను కూడా బూటకపు ఎన్ కౌంటర్ అంటూ పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఆరోపించాయి. ప‌ట్టుబ‌డిన ఆ ఇద్ద‌రిని తీసుకెళ్లి చంపేశార‌ంటూ నిరసనలు వ్యక్తం చేశారు పౌర హక్కుల సంఘాల నేతలు. శృతి మ‌హిళ అని కూడా చూడ‌కుండా చిత్ర హింస‌లు పెట్టి ఆ త‌రువాత అడ‌విలోకి తీసుకెళ్లి కాల్చి చంపార‌ని ఇది ముమ్మాటికి భూట‌క‌పు ఎన్ కౌంట‌రేన‌ని ఆరోపించిన సంగతి తెలిసిందే.  

మరుసటి సంవత్సరం 2016లో గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీంను కూడా ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఎన్ కౌంటర్ లో ప్రస్తుత సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక పాత్ర పోషించారు. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో సజ్జనార్ స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఐజీగా ఉన్నారు. 

హైదరాబాద్ నగర శివారు షాద్ న‌గ‌ర్ లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మ‌ర‌ణాయుధాల‌తో సంచ‌రిస్తున్నార‌ంటూ పోలీసులకు సమాచారం అందింది. అయితే పోలీసుల విచారణలో మరణాయుధాలతో సంచరిస్తుంది నయీం అని నిర్థారించారు. 

షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‍‌లో నయీం తలదాచుకున్నాడని విషయం తెలుసుకున్నారు. నయీంను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. పోలీసులను చూసిన నయీమ్ వారిపై కాల్పులకు తెగబడ్డాడు.  

ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నయీం చనిపోయాడు. నయీం ఎన్‌కౌంటర్‌తో అనేక వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. నక్సలైట్ నుంచీ గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీమ్ దందాలు, ల్యాండ్ సెటిల్మెంట్ల, బెదిరింపుల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

గ్యాంగ్ స్టర్ గా న‌యీం ఆకృత్యాలు చూస్తే అందరికీ ఒళ్లు గ‌గుర్పాటుకు గురికాక తప్పదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చుట్టుప్ర‌క్క‌ల రాష్ట్రాల్లోనూ నయీం దందాలకు అడ్డేలేకుండా పోయింది.  న‌యీం క‌న్నేశాడంటే ఇక అంతే ఎంతటి వాడైనా స‌రెండ‌ర్ కావాల్సిందే. లేక‌పోతే చావాల్సిందే అంతలా గ్యాంగ్ స్టర్ గా మారారు. 

ఇకపోతే మాఫీయా డాన్, చిక‌టి సామ్రాజ్య అధిప‌తిగా నయీం చేసిన భూదందా, సెటిల్ మెంట్ లకు పోలీసుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎందరో అండదండలు ఉన్నాయి. వారి అండదండలతో నయీం మరింత రెచ్చిపోయేవాడు. 

ఇకపోతే డిసెంబర్ 6న  దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ కూడా సంచలనం సృష్టించింది. దిశ రేప్, హత్య ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. నిందితులను ఉరితియ్యాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.  

తెలంగాణ వైద్యురాలు దిశను గతనెల 27న రాత్రి రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు నలుగురు నిందితులు. కేసు నమోదు చేసిన షాద్ నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి 24 గంటల్లోనే దారుణానికి ఒడిగట్టిన నలుగురు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులను అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో చర్లపల్లిలో జైల్లో ఉన్న నిందితులను గురువారం రాత్రి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసు రీ కనస్ట్రక్షన్ లో భాగంగా ఎక్కడైతే దిశను అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారో ఆ ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. 

కనువిప్పు కలగాలి, ఇంతటితో వదలొద్దు: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పవన్

కేసు విచారణకు సంబంధించి ఆధారాలు సేకరిస్తుండగా పోలీసులపై నిందితులు ముహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసులపై మెుదట రాళ్లతో దాడికి దిగారు. అనంతరం పోలీసుల దగ్గర ఉన్న తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితులు ముహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివలు దుర్మరణం చెందారు.  

ఇకపోతే సంచలనం సృష్టించిన నాలుగు ఎన్ కౌంటర్లలో రెండు ఎన్ కౌంటర్లలో ప్రస్తుత సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఉగ్రవాది వికారుద్దీన్ తో ప్రారంభమైన ఎన్ కౌంటర్ల పర్వం ఆ తర్వాత మావోయిస్టులు, గ్యాంగ్ స్టర్ నయీం, తాజాగా దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ వరకు పరంపర కొనసాగుతోంది.