Asianet News TeluguAsianet News Telugu

కౌలు రైతులకు పెట్టుబడి ఇచ్చే ప్రశ్నే లేదు : కేసిఆర్

హైదరాబాద్ లో కిరాయికి ఉండేవారికి ఇంట్లో హక్కులిస్తరా? 

Tenants will not be given Agri investement allowance: KCR

కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చే ప్రశ్నే లేదని మరోసారి తెలంగాణ సిఎం కేసిఆర్ స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకంలో అనుభవదారు అనే కాలమ్ నే ఎత్తేయించానని చెప్పారు. రైతులను ఇబ్బందిపెట్టడం ఒక రైతుగా తనకు ఇష్టం లేదు అని తెలిపారు. కౌలు రైతులకు అనుభవదారు పేరుతో భూమి మీద హక్కు కల్పించడమంటే.. హైదరాబాద్ లో కిరాయి ఇండ్లలో ఉన్న వారికి హక్కు కల్పించడం లాంటిదే అన్నారు. అలా ఎవరైనా ఒప్పుకుంటారా అని కేసిఆర్ ప్రశ్నించారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలని కోరుతున్న రాజకీయ పార్టీలను పట్టించుకునే సవాలే లేదన్నారు.

హోటల్ హెఐసిసిలో జరిగిన రైతు సమన్వయ సమితి సమావేశంలో తెలంగాణ సిఎం కేసిఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్వయసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎల్ ఐసి  ఉన్నతాధికారి వి. శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు బీమా పథకం అమలు విషయంలో ఎల్ఐసి సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సమావేశంలో సిఎం కేసిఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.

57 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నట్లు లెక్క తేలుతున్నది. రైతు బీమా అమలైతే..18 నుంచి 60 ఏళ్లలోపు రైతులు మరణిస్తే 10రోజుల్లో టన్షన్ గా 5లక్షల రూపాయలు వాళ్ల ఇంటికి వెళ్లి ఇస్తారు. ఎల్ఐసి వారు ఇస్తామని స్పష్టం చేశారు. వారికి ధన్యవాదాలు. 89 శాతం రైతులు రైతుబంధు స్కీంతో సంతృప్తిగా ఉన్నట్లు హిందూ పత్రికలో రిపోర్ట్ చేశారు.

కొంతమంది మనుషుల రూపంలో ఉంటారు. శ్రీరామచంద్రుల వారు లంక మీదకు యుద్ధానికి పోయిండు. యుద్ధం అయిపోయింది. ధర్మం గెలిచింది. సీతమ్మ వారిని తీసుకొని వస్తున్నడు. అప్పడు ధర్మ యుద్ధం. గంట మోగితే యుద్ధం ప్రారంభం.. గంట మోగితే మల్లా యుద్ధం ఆపాలి. మన సైడ్ ధర్మం ఉన్నది. ఎట్లైనా మనం గెలవాలె సార్ అని సైనికులు రాములవారితో అన్నరు. అప్పుడు రాముడు... నాదగ్గర రామబాణం ఉన్నది. ఆ రామబాణం వేస్తే అందరు సస్తరు. కానీ వద్దంటడు. సైనికులు మాత్రం రామబాణం వేయమంటారు. రాముడు బాణం వేస్తడు. అందరూ సచ్చిపోతరు. కానీ కొందరు సగమే సస్తరు. వాళ్లు రాముడిని అడుగుతరు.. మా సగం ఆయుష్సు సంగతేంది. మీరు కలియుగంలో పుట్టి మందిని పీక్కతినురి అని రాముడు అభయమిచ్చిండు. తెలంగాణలో ఇప్పుడున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీల వారు ఆ బాపత్ వారే.

గతంలో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోగానే పైరవీకారులు ఉంటారు. మనిషికి వెయ్యి ఇయ్యిరి అని వసూలు చేస్తరు. గతంలో ఒక్క పంట పండించాలంటే ఎన్ని గండాలు దాటాలె. మనం తెచ్చిన రైతు బంధు పథకం చూసి బయటి రాష్ట్రాల్లో విపరీతమైన వత్తిడి పెరుగుతా ఉంది. తెలంగాణలో కరెంటు సమస్య తీరిపోయింది. మోటర్లు కాల్తలేవు. ట్రాన్సఫార్మర్లు కాల్తలేవు. మోటార్ల మెకానిక్ షాపులు, ట్రాన్స్ ఫార్మర్ల షాపులు, కొన్ని పార్టీలు కూడా ఇప్పుడు దివాళా తీసినయ్. తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోదు. 24 గంటల కరెంటుతో నీళ్లు లేనికాడ ఎడమెట్టం అయినా.. నీళ్లు ఉన్నకాడ పంట మంచిగా వచ్చింది. ఇంకో ఏడాది దాటిపోతే 2019 జూన్ తర్వాత తెలంగాణ రైతు మొగులుకు ముఖం పెట్టి చూడడు. తెలంగాణలో మిషన్ కాకతీయ కింద బాగుచేసిన చెరువులు 365 రోజులు నిండే ఉంటయి. ఎప్పుడూ నింపుతూనే ఉంటం.

రైతు బంధు పథకం కింద వచ్చిన చెక్కులను డబ్బున్నవాళ్లు ఇష్టం లేకపోతే తీసుకోలేదు. నేను కూడా తీసుకోలేదు. కానీ రైతు బీమా పథకం నేను తప్పకుండా తీసుకుంట. మీరు కూడా అందరూ తీసుకోవాలి. 18లక్షల మంది రైతులు ఒక్క ఎకరం ఉన్నవాళ్లు ఉన్నరు. కొందరు రెండు, మూడు ఎకరాల వాళ్లు ఉన్నరు.  రైతు బంధు కింద 4956 కోట్లు చిన్న, సన్నకారు రైతులకే పోతున్నది. పెద్ద రైతులు గొప్పగా ఏం లేరు. ఎవరినీ చిన్నబుచ్చాలన్న ఉద్దేశం కాదు. భూమి ఎక్కువున్నవాళ్లకు కూడా అప్పే ఉన్నది. ఆయనేం గొప్పగా లేడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైతు 60 ఎకరాలు ఉన్నది. కానీ ఆయన హైదరాబాద్ లో కూలిపనిచేస్తున్నడు. ఏం లాభం 60 ఎకరాలు ఉంటే నీళ్లు లేవాయె.

ఎంత భూమి ఉన్నా రైతులు అందరూ అప్పులల్లనే ఉన్నరు. పెట్టుబడి కోసం రైతు వెతకని రోజు రావాలి తెలంగాణలో. అందుకే పెట్టుబడి సపోర్ట్ ఒకటి. ఒకవేళ రైతు చనిపోతే కుటుంబం రోడ్డుమీద పడకుండా బీమా ఇప్పుడు తెస్తున్నం.  ఫైనల్ గా రావాల్సింది మద్దతు ధర. అందరికి అన్నం పెట్టే రైతు ఆయనొక్కడు సల్లగ ఉంటే దేశం క్షేమంగా ఉంటది. బీమా విషయంలో మండల అధికారులు చేయాల్సిందేమంటే ? బీమా పత్రాలు రైతులతో నింపించి ఇవ్వాలి. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ మాత్రమే ఈ పనిచేయాలి. నామినీ ఎవరైతే వారి పేరు రాయాలి. పంద్రాగస్టు లోగా ఈ ఫామ్స్ నింపి అందజేయాలి. ఆగస్టు 15 తర్వాత రాష్ట్రంలో రైతు చనిపోతే 5లక్షలు ఇయ్యాలి.

పంటకు మద్దతు ధర రావాలంటే మనం ఏం చేయాలి. మద్దతు ధర నిర్ణయించే అధికారం మన పరిధిలో లేదు. కేంద్రం పరిధిలో ఉంది. మనం డిమాండ్ చేస్తున్నం. వాళ్లు ఏం చేస్తరో తెల్వదు. భారతదేశంలో తెలివిగల్ల రైతులు తెలంగాణలో ఉన్నారని పేరు రావాలి. తెలంగాణ రైతాంగానికి క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. వ్యవసాయ వాతావరణానికి ఏ జిల్లాలో , ఏ మండలంలో ఎట్లా ఉన్నది? ఏ పంట వేస్తే బాగా పండుతుందో శ్రాస్తవేత్తలు నిర్ణయిస్తారు.

తెలంగాణలో పండించే పంట ఆన్ డిమాండ్ ఉండేదే కావాలె. తెలంగాణ ఏం తింటది. అంటే ఎవరికి తెల్వదు. తెలంగాణ ఏం తింటది? అనేది మొన్ననే లెక్క తీపించినం. మనకు సరిపోయే పంట పోను మిగిలిన పంట ఎక్కడ అమ్ముకోవాలె. అంకాపూర్ లో పద్ధతి, కట్టుబాటు పెట్టుకున్నరు. వారే ఒక మార్కెట్ కమిటీ పెట్టుకున్నరు. తెలంగాణ రైతాంగం పక్షాన మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఒక పోస్టు సృష్టించండి. ఆయన కింద సిబ్బందిని పెట్టండి. మండల రైతు సమన్వయ సమితి నాయకులు, ఎఇఓలు కీలక పాత్ర పోశించాలి. వరి నాటు యంత్రాలు సబ్సిడీ మీద సప్లై చేద్దాం. కొన్నిరోజులుపోతే నాట్లేసే మహిళలు ఉండరు.

బీమా ఫామ్ లో ఇంటిపేరు, పూర్తిపేరు రాయాలి. ఎఇఓలు రైతుల ఇండ్లల్లనే తినాలె. గంజి పెడితే గంజి, గట్క పెడితే గట్క తినాలె. వాళ్ల ప్రేమను పొందాలె. రైతు వేదికల నిర్మాణం జరగాలి. ఎఇఓలు, మండల సమన్వయ సమితి అధ్యక్షులు లెక్కలు తీయాలి. ట్రాక్టర్లు ఎన్ని, కల్టివేటర్లు ఎన్ని వివరాలు తీసుకోవాలి. మీ క్లస్టర్ ను గర్వపడేలా చేయాలి.

 ఇప్పుడు వ్యవసాయం చేస్తా అని చెప్పడానికి సిగ్గు పడే పరిస్థితి వచ్చింది. పెళ్లి సంబంధానికి వస్తే వ్యవసాయం చేస్తడు అని చెబితే మొఖం అటు తిప్పుతున్నరు. చెప్రాసి కొలువైన ఉద్యోగం ఉంటే గొప్పగ చూస్తన్నారు. దాన్ని మార్చాలి. నేను తెలంగాణ రైతును అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి తీసుకురావాలి.

వ్వయసాయం చేసుడే కాదు. ఇగుమతి తో చేయాలె. హైదరాబాద్ చుట్టు ముట్టు 30, 40 కిలోమీటర్ల పరిధిలో రైతులు ధనవంతులు ఉండాలె. మెడ్చల్ జిల్లాలో రైతులు కూరగాయలే పండించాలె. బెంగుళూరు నుంచి కూరగాయలు హైదరాబాద్ కు తెచ్చుకునుడు ఏం పద్ధతి. ఆన్ డిమాండ్ ఉండే పంటలు పండించాలె. తెలంగాణలో ఏ ఎకరంలో ఏ పంట ఉన్నది. ఇప్పుడు ఎవరికైనా తెలుసా? ధాన్యం పంట కాలనీల ద్వారా ఎట్లైతే పండిస్తరో అమ్మడం కూడా అట్లే రైతు వేదికల ద్వారా అమ్మాలె.

1590 కింటా ధాన్యం ధర ఉంది. 1600 కు కొంటా అంటేనే వ్యాపారులకు అమ్మాలి. లేదంటే సుఖేందర్ రెడ్డికి డైరెక్ట్ ఫోన్ చేయాలె. రైతు సమన్వయ సమితిల ఆధ్వర్యంలో మద్దతు ధరకు ఒక్క రూపాయకు కూడా తక్కువకు అమ్మొద్దు.

రైతులు సహజ మరణం పొందినా కూడా బీమా వర్తిస్తది. ఏ రకంగా చనిపోయినా బీమా వర్తిస్తది. ఎఇఓల దే ఈ బాధ్యత. డెత్ సర్టిఫికెట్ ఇస్తే చాలు. అదే ఆధారం. వెంటనే బీమా సొమ్ము అందజేయాలి. ప్రపంచంలోనే అతి పెద్ద బీమా సంస్థ అయిన ఎల్ ఐసి ఉన్నతాధికారి శర్మ గారు పది రోజుల్లో బీమా సొమ్ము ఇస్తామని హామీ ఇచ్చిండు. రైతు బంధు పథకం కొనసాగిస్తాం. రెండు పంటలకు డబ్బులిస్తాం పెట్టుబడి కింద.

నాణ్యమైన కరెంటు ఇస్తాం.

ప్రాజెక్టులను తొందరగా కట్టి వీలైనంత తొందరగా నీళ్లిస్తాం.

ఎంత ఖర్చయినా సరే బీమా సొమ్ము చెల్లిస్తం. ఈ నాలుగు విషయాల్లో రైతుల కోసం ప్రభుత్వం సీరియస్ గ పనిచేస్తది.

రైతులు బ్యాంకులకు చెక్కులు తీసుకుని రాంగనే డబ్బు ఇయ్యపోతే నేను, మంత్రులం అందరం కలిసి రిజర్వు బ్యాంకు ముందు ధర్నా చేస్తామని చెప్పిన. అందుకే డబ్బు ఇచ్చిర్రు.

కౌలు రైతులకు కూడా ఇయ్యాలె అంటున్నరు. మరి కౌలు రైతులకు ఎట్ల ఇయ్యాలె. పాస్ బుక్ లో అనుభవదారు అనే కాలమ్ తీసిపారేయించిన. అనుభవదారు లేదు ఏం లేదు. పట్టాదార్ మాత్రమే. ఉపాసమున్నా రైతు పొలం అమ్మడు. చాలా కష్టంగా కంటికి రెప్పలా కాపాడుతున్నడు. అనుభవదారులకు ఇవ్వాలె అంటున్నరు... నిజమే హైదరాబాద్ లో కిరాయికి ఉన్నోళ్లకు కూడా హక్కు ఇద్దామా? అని అడిగిన. రైతుకు ఎటువంటి నెత్తినొప్పి ఉండొద్దు అన్నదే మన ఉద్దేశం. రైతు భూమి మీద ఇతరులకు హక్కులు కల్పించడం ఒక రైతుగా నాకు ఇష్టం లేదు. కోర్టులు, కేసులు వద్దు అని చెప్పిన. కౌలుదార్లు, రైతులు వాళ్లు వాళ్లు మాట్లాడుకుంటారు మనకు సంబంధం లేదు.

కమతాల ఏకీకరణ విషయంలో కూడా గ్రామ, మండల, జిల్లా సమన్వయ సమితిలను చైతన్యం చేయాలి. దానికి రైతులను ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఎక్కడ అన్నం పండిస్తరో ప్రపంచమంతా వాళ్లకే దండం పెట్టి కాళ్లు కడిగే పరిస్థితి వస్తది.

సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు పెంచే ప్రయత్నం చేయాలి. పాస్పేట్ వేస్తే పంటలు పండవు. భూమి చెడిపోకుండా శాశ్వతంగా పంటలు పండాలంటే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలె. మీకు మంచి మంత్రి గారు ఉన్నరు. ఆయన స్వయంగా రైతు. సమన్వయ సమితి అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి స్వయంగా రైతు. నేను కూడా స్వయంగా రైతు.

ఆహార శుద్ధి కాదు. ఆహార ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికోసం కొద్దిగా టైం పడతది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలంటే టైం పడుతుంది.

ఇండియాలో తెలివైన రైతులు, గొప్ప రైతులు, ధనవంతులైన రైతులు ఎక్కడ ఉన్నరంటే తెలంగాణలో ఉన్నరని నిరూపించాలె. తెలంగాణ వస్తదని ఎవ్వరు నమ్మలే. కానీ సాధ్యమైంది. ఇది కూడా మీరు ప్రయత్నం చేస్తే అయితది. మొట్ట మొదటిసారి నవ్వొచ్చింది సార్ అని రైతులు అన్నరు. పెట్టుబడి సాయం పథకం ద్వారా. నాకూ సంతోషమనిపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios