హైదరాబాద్ లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ సారి వేసవికి మంటలే...
వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది.
హైదరాబాద్ : నిన్నటి వరకు వణుకు పుట్టించిన చలి కనిపించకుండా పోయింది. భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. నిన్న మొన్నటి వరకు ఉదయం 8 గంటల వరకు కూడా కనిపించని భానుడు.. గత రెండు రోజులుగా సెగ మొదలుపెట్టాడు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. హైదరాబాదులో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు దడ పుట్టిస్తున్నాయి.
మంగళవారంనాడు హైదరాబాదులోని ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఈ మేరకు ఉన్నాయి. మోండా మార్కెట్లో గరిష్టంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. సరూర్నగర్ లో 36.3°, బాలానగర్లో 35.9 డిగ్రీలు, బేగంపేట్ లో 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత అధికమయ్యింది. రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి 21.2గా నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 17° వరకు మాత్రమే ఉన్నాయి.
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దాడి.. వీడియోలు వైరల్...
ఈ ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి నెలలో ఏటా సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే నాలుగు డిగ్రీలు అధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో నగరంలో విద్యుత్ వినియోగమూ పెరిగింది. నగరంలో ఈసారి ఎండలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పెరిగిన విద్యుత్ వినియోగంతో పగటిపూట 3100 మెగావాట్ల కరెంటు వినియోగం అవుతుంటే రాత్రి.. తొమ్మిది గంటల నుంచి 2,697 మెగావాట్ట వరకు విద్యుత్ వినియోగం నమోదవుతుంది. నిరుడుతో పోల్చుకుంటే 400 మెగావాట్ల వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నిరుడు ఇదే సమయంలో 2287 మెగావాట్లనే వినియోగించారు.