అంబానీకి బెదిరింపుల కేసు.. 19 ఏళ్ల తెలంగాణ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. తాజాగా ఈ కేసులో తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. గణేశ్ రమేశ్ వనపర్దిగా ఆ యువకుడిని గుర్తించారు.
హైదరాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి బెదిరింపుల కేసులో 19 ఏళ్ల తెలంగాణ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడిని గణేశ్ రమేశ్ వనపర్దిగా గుర్తించారు. నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తీసుకున్నారు.
ముకేశ్ అంబానీకి గతవారం పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ మెయిల్స్ పంపిన విషయం తెలిసిందే. గత వారం మూడు బెదిరింపు మెయిల్స్ ముకేశ్ అంబానీకి పంపారు. ఈ బెదిరింపు మెయిల్స్ పై ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇంచార్జీ ముంబయిలో అక్టోబర్ 27వ తేదీన ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
తొలి మెయిల్‌లో రూ. 20 కోట్లు డిమాండ్ చేస్తూ గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం మెయిల్ పంపించాడు. అనంతరం, రూ. 200 కోట్లు డిమాండ్ చేస్తూ మరో మెయిల్ ఆ కంపెనీకి వచ్చింది. తదనంతరం రూ. 400 కోట్లు అందించాలని, లేదంటే అంబానీని చంపేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది.
Also Read: ముఖేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. తీవ్ర పరిణామాలు ఉంటాయని మరో రెండు మెయిల్స్..
పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మెయిల్ ఐడీ షాదాబ్ ఖాన్ అనే వ్యక్తికి చెందినదిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే, ఆ మెయిల్స్ బెల్జియం నుంచి వచ్చినట్టు గుర్తించారు.
అయితే, ఈ మెయిల్ ఐడీ నిజంగా ఆ వ్యక్తిదేనా? లేక ఫేక్ ఐడీ ఉపయోగించి మెయిల్స్ పంపించారా? అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముకేశ్ అంబానీకి బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది బిహార్‌కు చెందిన ఓ యువకుడు అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ చేసిన సంగతి తెలిసిందే.