క్రికెట్ మోజులో ఇంట్లోంచి తప్పిపోయిన విద్యార్థి తన పేరును టెండూల్కర్ గా మార్చుకున్నాడు. తల్లిదండ్రులు ఉప్పల్ స్టేడియంలో కోచింగ్ ఇప్పిస్తున్నారు ముంబైలో మరింత బాగా క్రికెట్ నేర్చుకోవచ్చని వెళ్లినట్లు అనుమానం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆ బాలుడికి క్రికెట్ అంటే పిచ్చి. టెండూల్కర్ అంటే ప్రాణం. టెండూల్కర్ అంటే ఎంత ప్రాణమంటే తన తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చుకునేంతగా. క్రికెట్ ధ్యాసలో పడిన ఆ బాలుడు గత నెల 11వ తేదీన తప్పిపోయిండు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ తెలంగాణ టెండూల్కర్ గురించిన వివరాలిలా ఉన్నాయి.

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి హోసింగ్ బోర్డ్ కాలనీ కి చెందిన రేఖ, కృష్ణారావు ల కుమారుడు సాయి సృజన్ (16) శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. గత నెల జూన్ 11వ తేదీన ఉదయం 8 గంటలకు హెయిర్ కటింగ్ కు వెళ్లివస్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. దీంతో బాలుని తల్లిదండ్రులు అంతటా వెతికారు. కానీ బాలుడి ఆచూకి దొరకలేదు. గత 50 రోజులుగా కుమారుని ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారా తల్లిదండ్రులు.

తన కుమారుడికి క్రికెట్ అంటే బాగా పిచ్చి బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అందుకే తన పేరును సైతం సాయి సృజన్ నుంచి సృజన్ తెండూల్కర్ గా పేరు మార్చుకున్నాడని చెప్పారు. బాబుకు క్రికెట్ అంటే బాగా ఇష్టం ఉండడంతో ఉప్పల్ స్టేడియం లో కోచింగ్ కూడా ఇప్పిస్తున్నామని వారు అంటున్నారు. అయినా క్రికెట్ పై ఉన్న మోజుతో బాంబే లో ఉచిత శిక్షణ కేంద్రాలు ఉంటాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.

కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సాయి సుజన్ తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కుశాయిగూడ సిఐ చంద్రశేఖర్ తెలిపారు.