తెలంగాణ బస్సుల్లో రుచికరమైన స్నాక్స్... టీఎస్ ఆర్టిసి సరికొత్త సర్వీస్
తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో దూరప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. స్నాక్ బాక్స్ పేరిట ప్రయాణికులు చిరుధాన్యాలతో కూడిన స్నాక్స్ అందిస్తోంది టీఎస్ ఆర్టిసి.
హైదరాబాద్ :తెలంగాణ ఆర్టిసి ప్రయాణికులను ఆకట్టుకుని సంస్థ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బాట పట్టకుండా ఇప్పటికే టీఎస్ ఆర్టిసి లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ గరుడ పేరుతో హైదరాబాద్ నుండి దూర ప్రాంతాలకు తిప్పుతున్న బస్సుల్లో ప్రయాణికులకు స్నాక్స్ అందించే ఏర్పాట్లు చేసింది టీఎస్ ఆర్టిసి.
ఇవాళ్టి(శనివారం) నుండి హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ గరుడు బస్సుల్లో ప్రయాణికులకు స్నాక్స్ అందించనున్నారు.అయితే ఈ స్నాక్స్ కోసం ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయకుండా టికెట్ రేటులోనే రూ.30 కలిపి తీసుకోనున్నారు. ఇవాళ టీఎస్ ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ ఈ స్నాక్స్ అందించే సర్వీస్ ను ప్రారంభించారు.
తెలంగాణ ఆర్టిసి ప్రయాణికులకు అందించే స్నాక్స్ చిరుధాన్యాలతో తయారుచేయనున్నారు. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన చిరు ధాన్యాలతో తయారుచేసిన కారాతో పాటు చిక్కి, మౌత్ ప్రెష్ నర్, టిష్యూ పేపర్ ప్రయాణికులకు అందించాలని టీఎస్ ఆర్టిసి నిర్ణయించింది. ఈ స్నాక్ బాక్స్ ను హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ గరుడ బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. త్వరలోనే అన్ని బస్సుల్లోనూ ఈ సర్వీస్ ప్రారంభించనున్నట్లు ఆర్టిసి ఉన్నతాధికారులు తెలిపారు.
Read More ఆర్డినెన్స్‌ను మోడీ వెనక్కి తీసుకోవాల్సిందే.. కేజ్రీవాల్ వెంటే బీఆర్ఎస్ : కేసీఆర్
ఇక కొత్తగా ఆర్టిసి బస్సుల్లో స్నాక్స్ అందించే సర్వీసులపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని టీఎస్ ఆర్టిసి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్నాక్ బాక్స్ పై క్యూఆర్ కోడ్ ఏర్పాటుచేసారు... దీన్ని స్కాన్ చేసి ప్రయాణికులు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ప్రయాణికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని స్నాక్ బాక్స్ సర్వీస్ లో ఏవయినా మార్పులు చేర్పులు వుంటే చేస్తామని ఆర్టిసి అధికారులు తెలిపారు.