ఆర్డినెన్స్‌ను మోడీ వెనక్కి తీసుకోవాల్సిందే.. కేజ్రీవాల్‌ వెంటే బీఆర్ఎస్‌ : కేసీఆర్

ఢిల్లీ పాలనా వ్యవహారాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్ధతు ప్రకటించారు. 

telangana cm kcr extended support for delhi cm arvind kejriwal against Delhi Ordinance ksp

ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను తక్షణం ప్రధాని నరేంద్ర మోడీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. శనివారం ప్రగతి భవన్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి ఆయన సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని.. కేంద్రం తీరు ఢిల్లీ ప్రజలను అవమానించేలాగా వుందని కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామని సీఎం స్పష్టం చేశారు. 

బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం చాలా ఇబ్బంది పెడుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.  ఆర్ధిక పరిమితులు విధించడం, దాడులతో వేధించడం వంటి పనులకు బీజేపీ ఒడిగడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. దీనిని యావత్ దేశం చూస్తూ వుందన్నారు. ఢిల్లీలో మూడు సార్లు ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీని సాధించిందని.. అయినా మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముప్పుతిప్పలు పెట్టారని కేసీఆర్ దుయ్యబట్టారు. చివరికి సుప్రీంకోర్ట్‌కు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించుకోవాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారుల బదిలీలన్ని ఢిల్లీ ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేసీఆర్ తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని సీఎం చెప్పారు. ఆర్ధినెన్స్‌ ఉపసంహరించుకునే పోరాటంలో అరవింద్ కేజ్రీవాల్‌కు బీఆర్ఎస్ మద్ధతుగా వుంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్ధితులు వున్నాయన్నారు. 

ప్రజలు మోడీ సర్కార్‌కు గట్టి బుద్ధి చెబుతారని.. ఇప్పటికే కర్ణాటక ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారని కేసీఆర్ చురకలంటించారు. కేంద్రం తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎమర్జెన్సీ విధించే ముందు ఎలా వుందో ఇప్పుడు అలాంటి పరిస్థితి వుందని కేసీఆర్ గుర్తుచేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios