Hyderabad Food Safety: తెలంగాణలో 55 పిజ్జా అవుట్‌లెట్లలో ఆహార భద్రతా తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిజ్జా హట్, డొమినోస్ సహా అనేక అవుట్‌లెట్లలో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలను గుర్తించారు.
Hyderabad Food Safety: లొట్టలేసుకుంటూ పిజ్జా తింటున్నారా? అయితే, మీకోసమే ఈ అలర్ట్. తెలంగాణ ఆహార భద్రతా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 55 పిజ్జా అవుట్‌లెట్లలో అకస్మాత్తు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 18 పిజ్జా హట్ అవుట్‌లెట్లు, 16 డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లు, 21 స్థానిక పిజ్జా కేంద్రాలు, బేకరీలు ఉన్నాయి. తనిఖీల్లో అనేక చోట్ల ఆహార నిల్వ, పరిశుభ్రత, లైసెన్స్ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు వెలుగులోకి వచ్చాయి. చాలా దారుణంగా, చెండాలంగా ఉన్న పరిస్థితులను గుర్తించారు.
పిజ్జా హట్‌లో ఆహార భద్రతా లోపాలు
18 పిజ్జా హట్ అవుట్‌లెట్లలో ఎనిమిది చోట్ల పెద్దఎత్తున ఉల్లంఘనలు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో కొన్ని అవుట్‌లెట్లలో లైసెన్స్, జురిస్డిక్షన్ తేడా బయటపడింది. శాకాహార, మాంసాహార పదార్థాలను ఒకేచోట నిల్వ చేయడం, భద్రతా చర్యలు పాటించకపోవడం గుర్తించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించారు.
హన్మకొండ జిల్లా కాజీపేట్ ప్రాంతంలో పిజ్జా తయారీకి వాడే యంత్రాలు మురికి స్థితిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. వరంగల్‌లోని పిజ్జా హట్ అవుట్‌లెట్ అవసరమైన ఆహార భద్రతా సర్టిఫికేట్ చూపలేకపోయింది. నిజామాబాద్‌లో ఫ్రీజర్ అవసరమైన ఉష్ణోగ్రతను పాటించకపోవడం, వంట పాత్రలు మురికి స్థితిలో ఉండటం బయటపడింది. నల్గొండలో మూతలేని చెత్త బుట్టలు, గడువు ముగిసిన సాస్ బాటిళ్లు గుర్తించారు.
డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్లలో ఉల్లంఘనలు
డొమినోస్ అవుట్‌లెట్లలో కూడా తనిఖీల్లో 16లో 10 చోట్ల తీవ్ర లోపాలు కనుగొన్నారు. నిజామాబాద్‌లో మురికి పరిస్థితులను గుర్తించారు. ఉద్యోగులు గ్లౌజులు, మాస్కులు ధరించలేదు. పరికరాల తనిఖీ రికార్డులు లేవు.
హనుమకొండలోని సుబేదారి ప్రాంతంలో పిజ్జా తయారీ పరికరాలు శుభ్రం చేయకుండా వాడుతున్నట్టు బయటపడింది. వరంగల్‌లో ఉద్యోగులు ఆరోగ్య సర్టిఫికెట్లు చూపించినప్పటికీ అవి సరైన వైద్య పరీక్షలు లేకుండా జారీ అయినట్టు గుర్తించారు. మహబూబ్‌నగర్‌లో శాకాహార, మాంసాహార పదార్థాలను ఒకేచోట నిల్వ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
స్థానిక పిజ్జా అవుట్‌లెట్ల పరిస్థితి
హైదరాబాద్‌లోని పిజ్జా పారడైజ్‌లో లైసెన్స్ ప్రదర్శన లేకపోవడం, మెడికల్ సర్టిఫికెట్లు లేని సిబ్బంది, మళ్లీ మళ్లీ వాడిన నూనె, లేబుల్స్ లేని పన్నీర్, బ్రెడ్, బంగాళాదుంప చిప్స్ నిల్వ చేయడం బయటపడింది. వంటగది యంత్రాలు తుప్పు పట్టి ఉండగా, తెరిచి ఉన్న కిచెన్‌లో కీటకాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు.
మాస్టర్ వి బేకర్స్‌లో కూడా ఇలాంటి ఉల్లంఘనలు వెలుగుచూశాయి. కోకాపేట్, నర్సింగిలోని లా పినోజ్ పిజ్జా అవుట్‌లెట్లు యంత్రాల శుభ్రపరిచే షెడ్యూల్ పాటించకపోవడం గుర్తించారు. మెదక్ జిల్లాలోని పిజ్జా కార్నర్‌లో కవర్ చేయని కూరగాయలు, అధిక నూనె వినియోగం, పరుగులు, కీటక నియంత్రణ లేకపోవడం, మెడికల్ రికార్డులు లేని పరిస్థితి బయటపడింది.
ఆహార భద్రతా శాఖ చర్యలు
తెలంగాణ ఆహార భద్రతా శాఖ అధికారులు ఈ తనిఖీల్లో బయటపడిన అన్ని ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అవసరమైన రికార్డులు లేని అవుట్‌లెట్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అందించే ఆహార పదార్థాల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవడం తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు.
