బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు
Heavy Rain Alert : తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి.

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. భారీ వర్షాలు హెచ్చరికలు
వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం వైపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. అలాగే, సెప్టెంబర్ 25న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ అల్పపీడనం సెప్టెంబర్ 26 నాటికి వాయుగుండంగా మారి, 27వ తేదీన తీరాన్ని దాటే అవకాశం ఉందనీ, భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. వాతావరణశాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం.. రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 23, 24, 25న కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు, 26, 27న అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం జీహెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు.
తెలంగాణలోని 21 జిల్లాల ఎల్లో అలర్ట్
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయి. 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు
సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పుడు కూడా వానలు దంచికొడుతన్నాయి. రాత్రికి మరింతగా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. షేక్‌పేట 10.6 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీ 10.0, ఖైరతాబాద్ 9.0, బంజారాహిల్స్ 8.2, మైత్రివనం 6.9, ముషీరాబాద్ 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు వాహనాల్లో గంటల పాటు వర్షంలో ఉండిపోయారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది.
భారీ వర్షాలు.. ప్రజలకు ప్రభుత్వ హెచ్చరికలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలకు రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ చేశారు. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రయాణాలకు దూరంగా ఉండటం మేలని అధికారులు తెలిపారు.