గుడ్ న్యూస్: ఇక ఫింగర్‌టిప్స్‌లో బస్, మెట్రో, దైవ దర్శనం టికెట్లు
Mee Ticket : తెలంగాణలో ఇప్పుడు దైవ దర్శనం, ట్రావెల్, ఇంకా మరేదైనా టికెట్ల కోసం మీరు లైన్లలో నిల్చోవాల్సిన పనిలేదు ! ప్రభుత్వం మీరు ఉన్న చోటనే మీకు కావాల్సిన టికెట్లను అందిస్తోంది. ‘మీ టెకెట్ యాప్’ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ పౌర సేవల్లో డిజిటల్ విప్లవం
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం మరో వినూత్న అడుగు వేసింది. టికెట్ల కోసం ఇబ్బందులు పడాల్సిన పనిలేకుండా ఫింగర్‌టిప్స్‌లో బస్, మెట్రో, దేవాలయ దర్శనం టికెట్లు అందిస్తోంది. తెలంగాణ సర్కారు ప్రారంభించిన ‘మీ టికెట్’ (Mee Ticket) మొబైల్ యాప్ ద్వారా బస్సులు, మెట్రో, ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడా సముదాయాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి అనేక సేవలకు టికెట్లను ఒకే వేదికపై బుక్ చేసుకోవచ్చు. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ యాప్.. టికెట్ల కోసం గంటలతరబడి క్యూలలో నిలబడే ఇబ్బందులను తగ్గించడమే కాకుండా సమయాన్ని ఆదా చేసే మార్గాన్ని అందిస్తుంది.
ఒకే వేదికపై అనేక టిక్కెట్లు
మీ టికెట్ యాప్ తో మొదటిసారిగా తెలంగాణలో వివిధ రకాల టికెట్లు ఒకే యాప్‌లో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో
• TGRTC బస్సులు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ టికెట్లు
• భద్రాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ వంటి ప్రముఖ దేవాలయ దర్శన టికెట్లు
• జూపార్క్ సహా ప్రముఖ పార్కులు, బోటింగ్, మ్యూజియంలు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌ల టికెట్లు
• GHMC క్రీడా సముదాయాలు, జిమ్‌లు, కమ్యూనిటీ హాళ్ల టికెట్లు
ఇన్ని సౌకర్యాలు ఒకే వేదికపై లభించడం వల్ల పౌరులు డిజిటల్ రూపంలో అవసరమైన టికెట్లన్నీ సులభంగా పొందగలుగుతున్నారు.
మీ టికెట్ యాప్ లో సులభమైన బుకింగ్ ప్రక్రియ
మీ టికెట్ యాప్ వినియోగం చాలా ఈజీగానే ఉంటుంది. మీకు కావాల్సిన టికెట్ ను సులభంగా తీసుకోవచ్చు.
1. ముందుగా Google Play Store లేదా Apple App Store నుండి ‘Mee Ticket’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అయి లాగిన్ కావాలి.
3. కావలసిన విభాగాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు జూపార్క్ లేదా టెంపుల్ ఎంచుకోండి.
4. మీకు కావలసిన ప్రదేశాన్ని సెలెక్ట్ చేసి, టికెట్ బుకింగ్ పూర్తి చేయాలి.
5. చెల్లింపు కోసం UPI లేదా T-Wallet ను ఉపయోగించవచ్చు.
ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా టికెట్లు పొందే వీలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మీ టికెట్ యాప్ తో పౌరులకు కలిగే లాభాలు ఏంటి?
• గంటల కొద్దీ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు.
• ఒకే యాప్‌లో అన్ని రకాల టిక్కెట్లు సులభంగా అందుబాటులో ఉంటాయి.
• UPI ద్వారా సురక్షితమైన చెల్లింపులు చేయగలుగుతారు.
• వినియోగదారుడు ఎంచుకున్న ప్రదేశానికి సమీపంలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలు, ప్రముఖమైనవి కూడా సూచనగా కనిపిస్తాయి.
డిజిటల్ తెలంగాణ వైపు అడుగు
‘మీ టికెట్’ యాప్ రూపకల్పనలో TG ESDS (Telangana Department of Electronic Services Delivery) కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం. పర్యాటక, మతపరమైన, వినోదం, రవాణా రంగాల్లో డిజిటల్ మార్గాన్ని అందించడం ద్వారా, తెలంగాణ రాష్ట్రం మరోమారు సాంకేతికత ఆధారిత పాలనలో ముందంజ వేస్తోంది. మొత్తంగా, ‘మీ టికెట్’ యాప్ తెలంగాణ ప్రజలకు “ఒకే వేదిక పై అన్ని సేవలు” అనే సులభ మార్గాన్ని అందిస్తోంది. ఇకపై టిక్కెట్ల కోసం ఇబ్బందులు లేకుండా, ఫోన్‌లోనే కొన్ని క్లిక్‌లతో సేవలను పొందవచ్చు.