Telangana: ఇక చాలు.. తీన్మార్‌ మల్లన్నపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌. కీలక ఉత్తర్వులు జారీ

తీన్మార్‌ మల్లన్న.. గత కొన్ని రోజులుగా ఈ పేరు బాగా వినిపిస్తోంది. సొంత పార్టీనే ధిక్కరిస్తూ, ముఖ్యమంత్రిని విమర్శిస్తూ వార్తల్లో నిలిచిన ఈ ఎమ్మెల్సీపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. మల్లన్న (నవీన్‌)ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబందించి ఉత్తర్వులు వెలువడ్డాయి.. 
 

Telangana Politics Congress Suspends Teenmaar Mallanna know the reason in telugu  VNR

తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు పార్టీ షాక్‌ ఇచ్చింది. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి గతకొన్ని రోజుల క్రితం పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌ నోటీసులకు వివరణ ఇవ్వలేదని, అందుకే క్రమశిక్షణ చర్యల్లో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ జి. చిన్నారెడ్డి పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి. 

అసలేం జరిగిందంటే.. 

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై తీన్మార్‌ మల్లన్న విమర్శలు గుప్పించారు. బీసీల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. వరంగల్‌లో జరిగిన సభలో ఓ వర్గాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలకుగాను ఫిబ్రవరి 5వ తేదీన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. 

ఎవరైనా ఊరుకునేది లేదు: 

తీన్మార్‌ మల్లన్న సస్పెన్షన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పందించారు. ‘పార్టీ లైన్‌ ఎవరు దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం. బీసీ కుల గణన డాక్యుమెంట్లను చించడంపై ఏఐసీసీ సీరియస్‌ అయ్యింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్‌ దాటితే ఎవ్వరినీ వదలిపెట్టం’ అని హెచ్చరించారు. 

ఆ వర్గం ఒత్తిడితోనేనా.? 

ఇదిలా ఉంటే రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్‌ మల్లన్న చేసిన వ్యాఖ్యలను పార్టీ సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. రెడ్డి కులాన్ని తీవ్ర పదజాలంతో దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. షోకాజ్‌ నోటీసులు అందించిన తర్వాత కూడా మల్లన్న మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

మల్లన్న భవితవ్యం ఏంటి.? 

కాంగ్రెస్‌ పార్టీ సస్పెన్షన్‌తో తీన్‌మార్‌ మల్లన్న భవితవ్యం ఏంటన్న దానిపై ఇప్పుడు సర్వత్ర చర్చ నడుస్తోంది. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన తీన్మార్‌ మల్లన్న ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ రన్‌ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్‌, కేటీఆర్‌లపై పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. మొదట బీజేపీలో చేరిన తీన్మార్‌ మల్లన్న కొన్ని రోజులకే కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న 14,722 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం బీసీ నినాదాన్ని ఎత్తుకున్న మలన్న.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పలుసార్లు ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్న మరో పార్టీలో చేరుతారా.? లేదా తానే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా.? అన్నది ఆసక్తిగా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios