హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ)పై బిజెపి కేంద్రం ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తాను నిత్యం గాయత్రీ మంత్రం చదువుతానని, బిజెపి చెప్తేనే చదువుతున్నానా, నేను హిందువును కానా, నేను హిందువునే అని ఆయన అన్నారు. 

శృంగారీ పీఠాధిపతికి తాను సాష్టాంగ నమస్కారం చేస్తానని, చినజీయర్ స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తానని, తాను చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేదని ఆయన అన్నారు. తాను ఏది చేసినా బహిరంగంగానే చేస్తానని, తలుపులు మూసుకుని కొందరి మాదిరిగా చేయబోనని ఆయన అన్నారు.

Also Read: కుక్కలు మొరుగుతుంటాయి ... ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ కేసీఆర్

అతి స్వల్ప కాలంలో బిజెపిపై దేశంలో ఎదురుగాలి వీస్తోందని, ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలని, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తున్నారని ఆయన అన్నారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు మధ్యలో ప్రజలకు నచ్చుతుందా లేదా అనేది చూసుకోవాలని ఆయన అన్నారు. ప్రజల కోసమే మనం ఉన్నామని ఆయన అన్నారు. 

సిఏఏకు  వ్యతిరేకంగా అవసరమైతే తానే జాతీయ స్థాయిలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని ఆయన అన్నారు. దేశం కోసం తాను బయలుదేరుతానని, భయపడేది లేదని ఆయన అన్నారు. సమస్యపై పనిచేయాల్సి వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేస్తామని, భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. భావ సారూప్యత ఉన్నవాళ్లంతా కలుస్తారని ఆయన చెప్పారు. 

ముస్లిం అనే ముచ్చట ఎందుకు వస్తోందని, ముస్లిం అయితే ఓ విధమైన ట్రీట్ మెంట్, హిందువు అయితే మరో ట్రీట్ మెంట్ ఎందుకని ఆయన అడిగారు. దేశంలో సమస్యలే లేనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో అనేక సమస్యలున్నాయని, ఆర్థిక పరిస్థితి నాశనమవుతోందని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదంతా చేస్తున్నారని ఆయన బిజెపిపై విరుచుకుపడ్డారు. 

Also Read: జబర్దస్త్ రిటైర్ చేయిస్తారా, ఏంది: కేటీఆర్ కు సీఎం పోస్టుపై కేసీఆర్

భైంసాలో చెలరేగిన అల్లర్ల గురించి ప్రస్తావించగా భైంసా సంఘటన మంచిదని చెబుతామా, అల్లర్లకు కారకులైనవాళ్లు లోపలేశామని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూశామని ఆయన అన్నారు. వీళ్ల చిల్లర లొల్లితోనే ఆ సంఘటన జరిగిందని ఆయన బిజెపిని తప్పు పట్టారు. అటువంటి శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని, రాజీపడేది లేదని ఆయన అన్నారు. చిల్లర పంచాయతీలు పెడితే లోపల పడేస్తామని, సహించబోమని అన్నారు.

హిందూ ముస్లిం అనే తేడాలేందుకు, దానివల్ల ఏమైనా మునిగిపోతుందా, కడుపు నింపేదా ఆయన అన్నారు. తంతాం కొడుకా అంటే ముస్లింలు ఎటు పోవాలని ఆయన అడిగారు. మనవారి పట్ల ప్రపంచంలోని ఇతర దేశాలు అలాగే వ్యవహరిస్తే మనం ఎటు పోతామని ఆయన అడిగారు. గల్ఫ్ లో మనవాళ్లు చాలా మంది ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత బిజెపి కేంద్ర ప్రభుత్వంలాగా వ్యవహరిస్తే ప్రంపంచంలో నూకలు కూడా పుట్టవని ఆయన అన్నారు.

శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని, సంకుచిత భావాలు పనికి రావని ఆయన అన్నారు. సిఏఏకు వ్యతిరేకంగా వందల మంది మేధావులు లేఖలు రాస్తున్నారని ఆయన అన్నారు. నలందలో చైనావాళ్లు చదువుకున్నారని, ఇతర దేశాల వాళ్లు మనదేశంలో చదువుకున్నారని, మనవాళ్లు ఇతర దేశాల్లో చదువుకున్నారని, అది మనదేశ కీర్తి అని, నోబెల్ ప్రైజ్ వచ్చినవాళ్లు ఉన్నారని ఆయన అన్నారు.