హైదరాబాద్: ఠనన్ను పంపించే ఉపాయం ఉందా, గౌడ్ సాబ్ ఏమంటావు" అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని జాతీయ రాజకీయాలకు వెళ్తాననే ప్రచారంపై ఆయన స్పందిస్తూ ఆ విధంగా అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని ఆయన అన్నారు. బంద్ చేసుకోమంటే చేసుకుంటానని ఆయన అన్నారు. 

ముఖ్యమంత్రి ఎవరు కావాలి, ఎవరు కావద్దు అనే విషయానికి సమయసందర్భాలుంటాయని ఆయన చెప్పారు. కావాలనే ఆశ ఉంటుందని, అది తప్పు కాదని ఆయన అన్నారు. ఆది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదని ఆయన అన్నారు. ఆ విషయాన్ని తాను శాసనసభలో చెప్పానని, మళ్లీ చెబుతున్నానని ఆయన అన్నారు. 

తాను ఇటీవల జబ్బు పడ్డానని, ఆరోగ్య పరీక్షలు చేయించుకోక రెండేళ్లు అవుతుందని, ఇబ్బంది పడి ఆస్పత్రికి వెళ్లానని, బక్క పలుచ మనిషి అయిన తననుంచి 20 సీసాల రక్తం తీశారని, గంటలో రిపోర్టులు వచ్చాయని ఆయన అన్నారు. దుక్కలాగా ఉన్నావని వైద్యులు చెప్పారని, జలుబు ఎక్కువైందని, మాత్రలు వేసుకోమన్నారని అంటూ ఈ కండీషన్ లో ఏం చేయాలని అడిగారు.

నన్ను జబర్దస్త్ రిటైర్ చేయిస్తారా, ఏమిటి అని ఆయన హాస్యమాడారు. తనకు ఏమైనా అయితే కదా అని అన్నారు. నేను మంచిగా లేనా, తప్పు చేశానా ఆయన అన్నారు. ఆ తర్వాత ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తప్పకుండా జాతీయ రాజకీయాలకు వెళ్తానని ఆయన అన్నారు. 

మీడియా ప్రతినిధులు అడిగిన మరో ప్రశ్నకు జవాబిస్తూ తాను తెలంగాణ కోసం పోరాటం చేసే సమయంలో చంద్రబాబు ఎంత హైట్ లో ఉన్నాడు, భగవంతుడున్నాడు, గెలుస్తాం అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం లక్షల అవమానాలు భరించానని, రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవంగా బతుకుతున్నామని ఆయన అన్నారు. ఇప్పుడు ఎవరినీ అడుక్కునే అవసరం లేదని ఆయన అన్నారు. 

నిజామాబాద్ నగర పాలక సంస్థ ఫలితం గురించి ప్రస్తావించినప్పుడు తమకు, మజ్లీస్ కు కలిపి మెజారిటీ వచ్చిందని ఆయన అన్నారు. దేశానికి ఫెడరల్ విధానమే శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. కర్రపెత్తనం పనికి రాదని, దా్ని మరిచిపోకూడదని, తాత్కాలికంగా కొంత సాధించవచ్చు గానీ దీర్షకాలం ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన బిజెపిని ఉద్దేశించి అన్నారు. 

రాష్ట్రాలు ఎగ్జిక్యూటివ్ బాడీస్ కావని, రాజ్యంగబద్ధ సంస్థలని, వాటిని పక్కన పెడుతామంటే కుదరదని ఆయన అన్నారు. ఫెడరల్ స్ఫూర్తితో పనిచేసే జాతీయ పార్టీలు మాత్రమే మనుగడ సాగిస్తాయని, లేదా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపి రెండు కూడా విఫలమయ్యాయని, అందువల్ల ఫెడరల్ ఫ్రంట్ తప్పదని, వచ్చే ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ దే విజయమని ఆయన అన్నారు.

దేశంలో అనేక సమస్యలున్నాయని, పేదరికమూ పీడనా ఉన్నాయని, ఈ స్థితిలో సెక్టోరల్ విభజన ప్రజలను క్షోభకు గురి చేస్తుందని,  దాంతో ఉప్పెన వస్తుందని ఆయన అన్నారు. ముస్లింలు మన ప్రజలు కారా, ఎన్ని రోజులు ఏకాకులను చేస్తారు అని ఆయన అడిగారు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా మన దేశంలో ఉందని ఆయన అన్నారు. కలిసి బతుకలేమా, చిచ్చు పెట్టి ఏం సాధిస్తారు, రోజూ అనుమానంగా చూసుకుంటూ బతకాలా అని ఆయన ప్రశ్నించారు.