వీధి కుక్కలపై ఫిర్యాదుకు ఫోన్ నెంబర్, యాప్: జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రుల రివ్యూ
వీధి కుక్కలు, కోతుల బెడద నుండి నగర ప్రజలను రక్షించేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు ఇవాళ సమీక్షించారు.
హైదరాబాద్: మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా వీధి కుక్కల విషయమై ఫిర్యాదు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కోరారు. వీధి కుక్కలు, కోతుల బెడదపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , మహమూద్ అలీ లు గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. 11 అంశాలపై సమీక్ష నిర్వహింాచు మంత్రులు. కోతులు, వీధి కుక్కలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నగరంలోని మాంసం దుకాణాల వద్ద వీధి కుక్కలు చేరుతాయి. మాంసం దుకాణాల వద్ద వ్యర్ధాలను రోడ్లపై వేయడం వల్ల వీధి కుక్కలు మాంసం దుకాణాల చుట్టూ తిరుగుతాయని అధికారులు చెప్పారు.మాంసం వ్యర్ధాలను దుకాణ యజమానులు రోడ్లపై వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు.
హస్టల్స్, మెస్ , హోటల్స్ , రెస్టారెంట్స్ వంటి ప్రాంతాల్లో మిగిలిన ఆహర పదార్ధాలను ఖాళీ ప్రదేశాల్లో వేయడం వల్ల కూడా కుక్కలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మిగిలిన ఆహర పదార్ధాలను ఖాళీ ప్రదేశాలు, రోడ్లపై వేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇళ్ల మధ్యలో కూడా ఆహర వ్యర్ధాలను వేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. మరో వైపు వీధి కుక్కల విషయమై ఫిర్యాదు చేసేందుకు 040 21111111 నెంబర్ ను అందుబాటులో ఉంటుందని మంత్రులు తెలిపారు.
వీధి కుక్కలను పట్టుకొని వాటిని స్టెరిలైజ్ చేయాలని మంత్రులు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కోతులను కూడ పట్టుకొని నగరానికి దూరంగా వదిలేయాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంబర్ పేట లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
also read:హైదరాబాద్ లో వీధికుక్కల బెడద నివారణకు కార్యాచరణ ప్రణాళికలు.. ఫిర్యాదులకోసం ఫోన్ నెం. ఏర్పాటు..
ఈ నెల 19న హైద్రాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ మృతి చెందాడు. ఈ ఘటనతో అధికారుల్లో చలనం వచ్చింది. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడుల ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అంబర్ పేటలో వీధి కుక్కల దాడుల ఘటనను తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇవాళ ఈ విషయమై విచారణ నిర్వహించనుంది.