తెలంగాణ మంత్రులు కొందరు ప్రజలతో మమేకం అవుతూనే తమ శాఖ విధులను కూడా నిర్వర్తించారు. విద్యాశాఖమంత్రి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటే అటవీ శాఖ మంత్రి పోడుభూముల్లో దుక్కిదున్నారు. మరో మంత్రి చెట్టుకు పుట్టినరోజు వేడుక జరిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు.
రంగారెడ్డి : ఆర్టిసి బస్సెక్కిన మహిళా మంత్రి స్కూల్ విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటే... మరో మంత్రి అరక పట్టి దుక్కిదున్ని రైతు కష్టాన్ని స్వయంగా అనుభవించాడు. ఇంకో మంత్రి పర్యావరణాన్ని కాపాడుతున్న చెట్టుకు పుట్టినరోజు వేడుక జరిపారు. ఇలా తెలంగాణ మంత్రులు పలు కార్యక్రమాల కోసం సొంత నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలతో మమేకం అయ్యారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో గురువారం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలోనే మన్సాన్ పల్లి చౌరస్తా వద్దకు రాగానే ఓ ఆర్టిసి బస్సును చూసిన మంత్రి వెంటనే తన కారు ఆపారు. నాగారం వైపు వెళుతున్న ఆ బస్సులో ఎక్కిన సబితమ్మ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు.
ఏ పాఠశాలలో చదువుతున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రవాణా విషయంలో, స్కూల్లో బోధన, ఇతర వసతుల విషయంలో ఏమయినా సమస్యలుంటే చెప్పాలని సూచించారు. ఇలా విద్యార్థులతో కలిసి కొద్దిదూరం ఆర్టిసి బస్సులోనే ప్రయాణించి విద్యాశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు సబితా ఇంద్రారెడ్డి.
Read More కేసీఆర్ నాటిన చెట్టుకు పుట్టినరోజు... వేడుకలా జరిపిన మంత్రి ప్రశాంత్ రెడ్డి (వీడియో)
ఇదిలావుంటే మరో మంత్రి నాగలి పట్టి దుక్కిదున్నుతూ రైతు అవతారం ఎత్తాడు. సొంత జిల్లా నిర్మల్ లో అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సారంగాపూర్ మండలం రవీంద్రనగర్ తండాలో పట్టాల పంపిణీ అనంతరం రైతుల కోరిక మేరకు దుక్కిదున్నారు. రైతులాగే అరక పట్టుకుని ఎడ్లను అదుపుచేస్తూ కొంత పొలాన్ని దున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇలా కొద్దిసేపు రైతులా మారి వారి కష్టాన్న స్వయంగా అనుభవించారు అటవీ శాఖ మంత్రి.
ఇక మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హరితహారంలో భాగంగా తన ఇంటి ఆవరణలో సీఎం కేసీఆర్ నాటిన చెట్టుకు పుట్టినరోజు వేడుక జరిపారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులోని మంత్రి ఇంటి ఆవరణలో ఎనిమిదేళ్ల క్రితం హరితహారం మొదటివిడతలో భాగంగా ఓ మొక్కను నాటారు కేసీఆర్. ఈ మొక్క ఇప్పుడు పెద్ద వృక్షంగా మారి నలుగురికి నీడనిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా ఇదేతేదీన(06-07-2015) కేసీఆర్ నాటిన ఈ చెట్టుకు గురువారం మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో పుట్టినరోజు వేడుక జరిపారు.
చెట్టును బెలూన్లతో అందంగా ముస్తాబుచేసి కేక్ కూడా కట్ చేసారు. చెట్టునీడలో కేక్ ను కట్ చేసిన మంత్రి బిఆర్ఎస్ నాయకులను తినిపించారు. ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పుట్టినరోజు వేడుక జరిపినట్లు మంత్రి తెలిపారు. సీఎం నాటిన చెట్టు భర్త్ డే వేడుకలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
