తొమ్మిదేళ్లక్రితం హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి నాటిన మొక్క ప్రస్తుతం ఏపుగా పెరిగింది. ఈరోజు ఆ చెట్టు పుట్టినరోజు వేడుకను మంత్రి ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు. 

నిజామాబాద్ : తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం పేరుతో కేసీఆర్ సర్కర్ భారీగా చెట్ల పెంపకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులోని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో ఎనిమిదేళ్ల క్రితం ఓ మొక్కను నాటారు. ఈ మొక్క ఇప్పుడు పెద్ద వృక్షంగా మారి నలుగురికి నీడనిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం సరిగ్గా ఇదేతేదీన(06-07-2015) కేసీఆర్ నాటిన ఈ చెట్టుకు ఇవాళ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో పుట్టినరోజు వేడుక జరిపారు. 

చెట్టును బెలూన్లతో అందంగా ముస్తాబుచేసి కేక్ కూడా కట్ చేసారు. చెట్టునీడలో కేక్ ను కట్ చేసిన మంత్రి బిఆర్ఎస్ నాయకులను తినిపించారు. ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పుట్టినరోజు వేడుక జరిపినట్లు మంత్రి తెలిపారు. సీఎం నాటిన చెట్టు భర్త్ డే వేడుకలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసిఆర్ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా గొప్పదని అన్నారు. ఇది ఓట్ల కోసం చేసేది కాదని... భావి తరాల భవిష్యత్తు కోసం చేపట్టిన అద్భుత కార్యక్రమని పేర్కొన్నారు.ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రపంచవ్యాప్తంగా అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణలో మాత్రం పెరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుజాగ్రత్తతో చేపట్టిన పర్యావరణ హిత చర్యల వల్ల తెలంగాణలో 7.7 శాతం అడవులు పెరిగాయని మంత్రి తెలిపారు.

వీడియో

మొక్కులు నాటడమే కాదు వాటిని సంరక్షించడం అందరి బాధ్యత అని ప్రశాంత్ రెడ్డి సూచించారు. మొక్కల పెంపకంతో ఎన్నో లాభాలున్నాయని అన్నారు. ముఖ్యంగా సకాలంలో వర్షాలు కురవాలంటే చెట్లు వుండాలని... అయితేనే పంటలు పండి మనం తినేందుకు ఆహారం దొరుకుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇదిలావుంటే ఎస్సారెస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకున్న సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం ఉప్లుర్ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.