కేసీఆర్ ప్రజల కోసం ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా వదిలేశారని హరీశ్ ప్రశంసించారు.  పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేయాలని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారని తెలిపారు. 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే.. సూర్యుడి మీద ఉమ్మేసినట్లేనని చురకలంటించారు. రైతుల పట్ల కాంగ్రెస్ విధానమెంటో తెలిసిపోయిందని.. రేవంత్ 3 గంటల కరెంట్ చాలు అంటరాని, ఉచిత విద్యుత్‌కు సోనియా గాంధీ వ్యతిరేకమని ఆ పార్టీ అధికార ప్రతినిధే చెప్పారని మంత్రి దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై రైతులు తిరగబడుతూ వుండటంతో చేసేదేం లేక వారు కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారని హరీశ్ తెలిపారు. దేశంలో రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ గత పరిస్ధితులు పునరావృతమవుతాయని హరీశ్ రావు జోస్యం చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, కరెంట్‌కు సంబంధించి నాటి పత్రికలు కార్టూన్లు సైతం వేశాయన్నారు. రైతులకు ఏడు గంటలు కరెంట్ ఇవ్వలేమని నాటి సీఎం ప్రకటించారని మంత్రి తెలిపారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమే విద్యుత్ అని హరీశ్ రావు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించమన్నందుకు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు రైతులను కాల్చి చంపారని మంత్రి గుర్తుచేశారు. దీనిపై చలించిపోయిన కేసీఆర్.. డిప్యూటీ స్పీకర్‌గా వున్నప్పటికీ సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారని హరీశ్ అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారని తెలిపారు. 

Also Read : ‘కరెంట్’ కామెంట్లతో పార్టీని ఇరకాటంలోకి నెట్టిన రేవంత్.. రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్

కేసీఆర్ ప్రజల కోసం ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి పదవులను గడ్డిపోచల్లా వదిలేశారని హరీశ్ ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు కూడా ఉచిత విద్యుత్ వద్దన్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుందో లేదో కాంగ్రెస్ నేతలు తీగలను పట్టుకుంటే తెలుస్తుందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ మా నినాదమని మంత్రి తెలిపారు. తెలంగాణలో మూడు పంటలు, మూడు గంటలు, మతం పేరిట మంటలు .. అన్నవి నినాదాలని ఎవరు కావాలో తేల్చుకోవాలని హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.