తెలంగాణ సర్కారు నిర్లక్ష వైఖరిపై జర్నలిస్టులు కయ్యానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులకు ఉన్న పథకాలు సైతం తెలంగాణ సర్కారు అమలు చేయడంలేదని విమర్శిస్తున్నారు. సర్కారు మౌనముద్ర వీడకపోతే ఉద్యమబాట తప్పదని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ముఖ్య సలహాదారుడు కె. శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలంగాణ సర్కారు తీరును ఎండగట్టారు. జర్నలిస్టులకు ముఖ్య సౌకర్యాలైన అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని వారు ఆరోపించారు. గతేడాది రాష్ట్రంలో సుమారు 11 వేల అక్రెడిటేషన్ కార్డులు జారీకాగా, కేవలం 4,800 మంది జర్నలిస్టులకు మాత్రమే హెల్త్ కార్డులు మంజూరయ్యాయని వారు తెలిపారు. అయితే ఈ యేడాది సదరు హెల్త్ కార్డుల్లో కేవలం 60 శాతం మాత్రమే రెన్యువల్ అయ్యాయని, మిగతా 40 శాతం జర్నలిస్టులకు రెన్యువల్‌కు సంబంధించి సమాచారశాఖనుండి మెసేజ్‌లు అందలేదన్నారు. గత యేడాది హెల్త్ కార్డులు కలిగియుండి ఈ యేడాది అవి రెన్యువల్ కాకపోవడంతో వివిధ ప్రమాదాల్లో, వ్యాధులకు గురై ఖరీదైన వైద్య సౌకర్యం పొందలేక 20మంది జర్నలిస్టులు మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని గతంలో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ కనీసం అక్రెడిటేషన్ ఉన్న వాళ్లకి కూడా హెల్త్ కార్డు అందించలేని పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ రెడ్డి, అమర్‌లు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం నుండి మొదలుకొని రాష్ట్ర విభజన జరిగినంత వరకు రాష్ట్రంలో సుమారు 440మంది జర్నలిస్టులు, వివిధ వ్యాధులకు గురై ప్రమాదాల్లో మృతి చెందగా, ఎంతో అట్టహాసంగా నిర్వహించిన జనహిత కార్యక్రమంలో కేవలం 60 కుటుంబాలకే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్‌కభుత్వం ఏర్పడిన తర్వాత మృతి చెందిన జర్నలిస్టులకు మాత్రమే సహాయం అందిస్తామనడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడి, ప్రభుత్వం ఏర్పడకముందే మృతి చెందిన జర్నలిస్టులకు ఆంధ్ర ప్రభుత్వం సహాయం చేయాలా? అని వారు ప్రశ్నించారు.
రేపు, మాపు అనుకుంటూ రెండేళ్లుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం విచారకరమన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా మునిసిపల్ సమావేశాల్లో జర్నలిస్టులను నిషేధిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరైన చర్య కాదని శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ, ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఎం.ఏ. మాజిద్‌లు పాల్గొన్నారు.
