మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ కు దూరమై తెలంగాణ జాగృతి ద్వారా ప్రత్యక్ష రాజకీయాలు చేపట్టారు…సొంతంగా ప్రజల కోసం పోరాటానికి దిగారు. ఈక్రమంలో మంగళవారం ఆమె అరెస్టయ్యారు. 

Kalvakuntla Kavitha : తెలంగాణ జాగృతి నాయకురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి వదిలేసారు. విద్యార్థులు, ఉద్యోగులు ఉపయోగించే ఆర్టిసి బస్ పాస్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి మంగళవారం నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే కవిత ఆధ్వర్యంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఆమెను అరెస్ట్ చేసి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు… పరిస్థితి చక్కబడ్డాక వదిలేసారు.

మంగళవారం తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి కవిత బస్ భవన్ ముట్టడికి బయలుదేరారు. దీంతో బస్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది... వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అడ్డుకున్నారు. 

తమ నిరసనను పోలీసులు అడ్డుకుని బస్ భవన్ వైపు వెళ్లకుండా అడ్డుకోవడంతో కవిత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు... ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కవిత, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది... చివరకు ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తమ నాయకురాలిని అరెస్ట్ చేయడంతో తెలంగాణ జాగృతి శ్రేణులు చాంద్రాయణగుట్టకు చేరుకుని పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అయితే కొద్దిసేపటి తర్వాత పరిస్థితి చక్కబడటంతో పోలీసులే కవితను విడుదల చేసారు. దీంతో కవిత అక్కడినుండి వెళ్లిపోయారు.

బస్ పాస్ ఛార్జీల పెంపుపై కవిత మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై పెనుభారం పడుతుందని అన్నారు. ముఖ్యంగా నిత్యం బస్సుల్లో ప్రయాణించే చిరుద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ఆర్థికభారం పడుతుందని అన్నారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలపై ఈ సర్కార్ మరో గుదిబండ మోపిందన్నారు. వెంటనే పెంచిన బస్ పాస్ ఛార్జీలను తగ్గించాలని కవిత డిమాండ్ చేసారు.

ఇప్పటికే ఆర్టిసి బస్సులను విద్యార్థుల కోసం నడపడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి... కేవలం ఆదాయం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని తాజా ఛార్జీల పెంపుతో స్పష్టమవుతోందన్నారు. ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటుపడిందన్నారు. విద్యార్థులు ఎక్కువగా ప్రయాణించే రూట్లలో బస్సులు నడపాలని కవిత డిమాండ్ చేసారు.