కవిత సీఎం సీటుపై కన్నేసారా..? అందుకే అన్నను టార్గెట్ చేసారా?
తెలంగాణ రాజకీయాలో కేసీఆర్ కూతురు కవిత హాట్ టాపిక్ గా మారారు. ఆమె అన్నపై తిరుగుబాటు చేసే మరో షర్మిల అవుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా కవిత తాను తండ్రికి రాసిన లేఖ బయటకురావడంపై చేసిన కామెంట్స్ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తండ్రికి రాసిన లేఖపై కవిత క్లారిటీ
Kalvakuntla Kavitha : భారత రాష్ట్ర సమితి పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత లేఖ కలకలం రేపుతోంది. తన తండ్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ఆమె తన తండ్రి దృష్టికి కీలక విషయాలను తీసుకున్నారు. ముఖ్యంగా బిజెపి విషయంతో బిఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును కవిత తప్పుబట్టారు. దీంతో ఈ లేఖ రాజకీయ దుమారం రేపుతోంది.
అయితే తండ్రికి రాసిన లేఖ బైటపడ్డ సమయంలో కవిత అమెరికాలో ఉన్నారు. కొడుకు చదువుకు సంబంధించిన కార్యక్రమం కోసం ఆమె అక్కడికి వెళ్లారు. ఆమె హైదరాబాద్ కు చేరుకోగానే విమానాశ్రయంవద్దే ఆమె మీడియాతో మాట్లాడారు. కవిత లేఖ లాగే తాజాగా మాటలు కూడా రాజకీయంగా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన తండ్రిని దేవుడు అంటూనే ఆయన చుట్టున్నవారిపై తీవ్ర ఆరోపణలు చేసారు కవిత. దీంతో ఆమె ఎవరినో టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోంది... ఆమె అంటున్న కేసిఆర్ పక్కనుండే ఆ వ్యక్తులు ఎవరు? వారితో ఈమెకు చెడిందా? కవిత అంటున్న ఆ వ్యక్తులు కుటుంబసభ్యులేనా? కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ లనే కవిత టార్గెట్ చేసారా? ఇలా అనేక అనుమానాలు రాజకీయవర్గాల్లో మొదలయ్యాయి.
ఇంతకూ కవిత ఏమన్నారంటే
తన తండ్రి కేసీఆర్ కు తాను తరచూ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉత్తరాలు రాస్తుంటానని కవిత తెలిపారు. ఇలా రెండువారాల క్రితం ప్రస్తుత రాజకీయాలు, బిఆర్ఎస్ పార్టీ వ్యవహారతీపుపై తండ్రికి లేఖ రాసినట్లు.. అదే బయటకు వచ్చిందని తెలిపారు. తాను రాసిన లేఖనే తాజాగా బయటకు వచ్చిందన్నారు. అయితే ఇది ఎలా బయటకు వచ్చిందో తనకు అర్థంకావడం లేదన్నారు.
ఇప్పటివరకు తండ్రికి చాలా ఉత్తరాలు రాసానని.. ఎప్పుడూ ఇలా బయటకు రాలేవన్నారు.. కానీ ఇప్పడిలా జరిగిందంటే తనచుట్టూ ఏదో జరుగుతోందని అర్థమవుతోందన్నారు. తన తండ్రి దేవుడు... ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయని కవిత అన్నారు. సొంత కూతురినైన తాను రాసిన లేఖలే ఇలా బయటకు వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని కవిత ఆందోళన వ్యక్తం చేసారు.
తండ్రి దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు
అయినా తానేమీ పర్సనల్ అజెండాతో ఆ లేఖ రాయలేదని... పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బిఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ మాటలనే ఈ లేఖ ద్వారా తండ్రికి తెలియజేసానని కవిత తెలిపారు. కానీ అంతర్గతంగా రాసిన లేఖ ఇలా బయటకురావడం వెనక కుట్ర ఉందన్నారు. ఈ లేఖను ఎవరు బహిర్గతం చేసారు? దీని వెనకున్నది ఎవరు? తెలియాలన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ చుట్టూ ఉండే దెయ్యాలపనే అయివుంటుందని కవిత అన్నారు.
ఇకపై కూడా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ముందుకెళ్తుందని కవిత స్పష్టం చేసారు. మా నాయకుడు కేసీఆరే... ఈ విషయంలో ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఇక తమ కుటుంబం, పార్టీ కూడా ఐక్యంగా ఉందని కవిత స్ఫష్టం చేసారు.
కాబోయే సీఎం కవితేనా?
అమెరికా పర్యటనను ముగించుకుని తిరిగివచ్చిన కవిత బలప్రదర్శన చేసారనే చెప్పాలి. విమానాశ్రయం వద్దకు భారీగా ఆమె మద్దతుదారులు, తెలంగాణ జాగృతి శ్రేణులు చేరుకున్నారు... బిఆర్ఎస్ శ్రేణులు కనిపించలేదు. అలాగే ఆమెకు స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు కనిపించలేదు... బిఆర్ఎస్ పార్టీ ప్రస్తావన కూడా లేదు. అంతేకాదు కవిత కాబోయే సీఎం అన్నట్లుగా వినిపించిన నినాదాలు, కనిపించిన ప్లకార్డులు మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
కవిత టార్గెట్ కేటీఆరేనా?
ఇక కవిత మాటలు కూడా అనేక అనుమనాలను రేకెత్తిస్తున్నాయి. తన తండ్రి చూట్టూ దెయ్యాలు చేరాయని... తాను తండ్రికి రాసిన లేఖను కుట్రపూరితంగా వీరే బయటపెట్టివుంటారని కవిత ఆరోపించారు. అలాగే బిఆర్ఎస్ నాయకత్వం తండ్రి చేతుల్లోనే ఉంటుందనేలా ఆమె మాట్లాడారు. ఈ మాటలనుబట్టి చూస్తే కవిత తన సోదరుడు కేటీఆర్ నే టార్గెట్ చేసారా అన్న అనుమానం కలుగుతోంది. ఈమె కూడా తండ్రి రాజకీయ వారసత్వం కోసం జగన్ తో విబేధించిన షర్మిలలా మారబోతున్నారంటే ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనికి కవిత మాటలు మరింత బలాన్నిచ్చాయి.