గజ్వెల్ కోటలో కోదండ యాత్ర సర్కారు ఆటంకాలు, పోలీసుల అడ్డగింపులు కెసిఆర్ వైఫల్యాలను ఎండగట్టనున్న జెఎసి  

తెలంగాణ జెఎసి తలపెట్టిన మూడో విడత అమరుల స్పూర్తియాత్రకు రాష్ట్ర సర్కారు ఆటంకాలు కలిగిస్తున్నది. పోలీసులను బరిలోకి దింపింది సర్కారు. ఎక్కడికక్కడ జెఎసి యాత్రకు వెళ్లకుండా పోలీసులు జనాలను, జెఎసి కార్యకర్తలను నిలువరిస్తున్నారు. కొండపోచమ్మ బాధితులు ఎట్టి పరిస్థితుల్లోనూ జెఎసి సభకు కానీ, యాత్రకు కానీ వెళ్లకుండా పోలీసులు జబర్దస్త్ చేస్తున్నరు. ఎవరినీ గ్రామాల నుంచి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు సిఎం కెసిఆర్ నియోజకవర్గం కావడంతో ఇటు జెఎసి అటు సర్కారు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జెఎసి అమరులయాత్ర విజయవంతం చేసేందుకు జెఎసి పూనుకుంది. మరోవైపు విఫలం చేసేందుకు చాపకింద నీరులా చేయాల్సిన ప్రయత్నాలన్నీ సర్కారు చేస్తున్నది.

ఆదివారం ఉదయం గన్ పార్కు వద్ద యాత్ర ప్రారంభమైంది. ఇక గజ్వెల్ స్థితిగతులపై జెఎసి ఒక పోస్టర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏ ఏ అంశాల్లో గజ్వెల్ నెంబర్ 1 స్థానంలో ఉందో వివరిస్తూ పోస్టర్ రూపొందించారు జెఎసి నేతలు.

కెసిఆర్ కుటుంబసభ్యుల ప్రాంతాల్లోనే జెఎసి అమరుల యాత్ర చేపట్టడం వ్యూహాత్మంగానే అన్న వాదన వినిపిస్తోంది. తొలుత హరీష్ కోటలో యాత్ర చేపట్టిన జెఎసి తర్వాత కెటిఆర్ జిల్లాలో పోరు జరిపారు. తర్వాత సిఎం కెసిఆర్ నియోజకవర్గంపైనే గురి పెట్టింది జెఎసి. దీంతో సర్కారులో చలనం వచ్చింది. ఆందోళన మొదలైంది. అందుకే మూడో దశ యాత్రను విచ్ఛిన్నం చేయాలన్న తలంపుతో పోలీసులను ప్రయోగించి ఆటంకాలు సృష్టిస్తోందని జెఎసి నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక మూడు దశల తర్వా జెఎసి నాలుగో దశ ఎక్కడ నిర్వహిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. కెసిఆర్ కుటుంబంలో మిగిలిన ప్రజా ప్రతినిధి కవిత మాత్రమే. నాలుగో విడత కవిత నియోజకవర్గమైన నిజామాబాద్ జిల్లాలో చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.