నరేంద్రమోడీ తెలంగాణ టూర్: ప్రధానికి 8 డిమాండ్లతో తెలంగాణ మేథావుల లేఖ
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ మేధావులు బుధశారంనాడు లేఖ రాశారు.64 మంది ఈ లేఖపై సంతకం చేశారు. ఎనిమిది డిమాండ్లను ఈ లేఖలో ప్రస్తావించారు.
హైదరాబాద్:ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎనిమిది డిమాండ్లతో తెలంగాణ మేథావులు బుధవారంనాడు లేఖ రాశారు. 64 మంది విద్యావేత్తులు,ప్రొఫెసర్లు ఈ లేఖ రాశారు. ఈ నెల 12న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో ఈ లేఖ ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది.విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆ లేఖలో కోరారు.ఐటీఐఆర్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.మతతత్వ ధోరణిని విడనాడి దేశ ఐక్యతను కాపాడాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు.రాష్ట్రానికి సాఫ్ట్ వేర్ పార్కులివ్వాలని కోరారు.రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు,నవోదయ విద్యాసంస్థలను కేటాయించాలని కోరారు.వివక్ష లేకుండా కొనుగోలు చేుయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరిత,వివక్ష,పక్షపాత ధోరణిని విడనాడాలని ఆ లేఖలో కోరారు. దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.ప్రజల మత విశ్వాసాలు,ఆహారపు అలవాట్ల విషయంలో నియంతృత్వ విధానాలను అవలంభిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకారణంగా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని వారు ఆ లేఖలో ఆరోపించారు.పెట్రోల్,డీజీల్, గ్యాస్ తోపాటు నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.
తెలంగాణ సాధనం కోసం తాము పోరాటం చేసిన విషయాన్ని ఆ లేఖలో మేథావులు గుర్తు చేశారు.తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు దాటినా కూడా కేంద్రం ఇచ్చిన హామీల అమలులో ఎలాంటి పురోగతి లేదని ఆ లేఖలో వారు పేర్కొన్నారు.కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రంలో ఏర్పాటుకు పూనుకోవడం తెలంగాణపై చిన్నచూపునకు నిదర్శనంగా పేర్కొన్నారు.రాష్ట్రంలో గిరిజన యూనివర్శిటీ ఇంకా ఊసేలేదన్నారు.పారిశ్రామిక రాయితీల విషయాన్ని కేంద్రం మర్చిపోయిందని ఆ లేఖలో మేథావులు విమర్శించారు.
ఈ నెల 12న రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధానిమోడీ వస్తున్నారు. ఈ టూర్ ను అడ్డుకొంటామని విద్యార్థి జేఏసీ ప్రకటించింది. ప్రధాని మోడీకి తెలంగాణపై ఇప్పుడు ఎందుకు ప్రేమ వచ్చిందని సీపీఐ ప్రశ్నించింది. మోడీ టూర్ ను అడ్డుకొంటామని సీపీఐ తెలిపింది. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా తాము ప్రచారం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణ మేథావులు ప్రధాని మోడీకి లేఖ రాశారు.