హైదరాబాద్‌లో బీజేపీ మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వివరాలు ఇవే..
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించేందుకు బీజేపీ సిద్దమైంది. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై జాప్యాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన మహా ధర్నాకు హైకోర్టు అనుమతించింది. అయితే 500 మంది మాత్రమే ధర్నాలో పాల్గొనాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో పార్టీ నాయకులు ఈరోజు నిరసనలు, ధర్నాలు చేపట్టారు.
ఇక, ఈ నెల 20వ తేదీన బాటసింగారంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సందర్శనకు వెళ్తున్న టీ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు బయలుదేరిన కిషన్ రెడ్డిని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)పై పోలీసులు అడ్డుకోవడంతో హై డ్రామా చోటుచేసుకుంది. దీంతో కిషన్ రెడ్డి అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బాటసింగారం వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు కిషన్ రెడ్డికి చెప్పగా.. వారితో ఆయన వాగ్వాదం పెట్టుకున్నారు. తాను ఏమైనా ఉగ్రవాదినా? అని ప్రశ్నించారు. తనను చంపేస్తే చంపేయండి అని కూడా అన్నారు. అదే రోజు పలువురు బీజేపీ నేతలను కూడా పోలీసులు బీజేపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.
ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు నిధులు కేటాయించకుండా పేదలను విస్మరించారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు సరిపడా ఇళ్ల స్థలాలు అందేలా తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.