ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటు, తేలు కాటుకు మందులు ఉంచుకోవాలి: సచివాలయంలో ఆరోగ్యమంత్రి హరీశ్ రావు సమీక్ష
వర్షాలు భారీగా కురుస్తున్న తరుణంలో అంతరాయాలు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందించడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ పాముకాటు, తేలుకాటుకు మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డీఎంఈ రమేశ్ రెడడ్ి, డీహెచ్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ హరిచందన సహా అన్ని జిల్లా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రజలకు వైద్య అందించాలని చెప్పారు. సబ్ సెంటర్ స్థాయి నుంచి రాజధాని నగరంలోని ప్రధాన హాస్పిటళ్ల వరకు వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తత, సంసిద్ధతతో ఉండాలని వివరించారు. వర్షా కాలంలో తేలు కాటు, పాము కాటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో పాము కాటు, తేలు కాటుకు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచనలు చేశారు. ప్రభుత్వ మందుల స్టోర్‌లలో సరిపడా మందులున్నాయని, కాబట్టి, పీహెచ్‌సీల్లో మందుల కొరత అనే మాట రావొద్దని స్పష్టం చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించడానికి అవసరమైతే హెలికాప్టర్లనూ వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో నిరంతరం వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర స్థాయిలో 24 గంటలు కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119ను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలోనూ కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. 108, 102 అంబులెన్స్‌ల సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని, గర్భిణులు, డయాలసిస్ పేషెంట్లకు చికిత్స విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. కేసీఆర్ కిట్ ఆధారంగా వివరాలు తెలుసుకుని డెలివరీ డేట్‌కు అనుగుణంగా గర్భిణిలకు స్వయంగా సహాయం చేయాలని వివరించారు.
Also Read: హైద్రాబాద్‌లో కుండపోత వర్షం: పలు చోట్ల ట్రాఫిక్ జాం, వాహనదారుల ఇబ్బందులు
కలుషిత ఆహార పదార్థాల బారిన ప్రజలు పడకుండా ఎప్పటికప్పుడు నాణ్యతపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. పరిశుభ్రత పట్ల అందరికీ అవగాహన కల్పించాలని వివరించారు.
ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో చర్యల గురించి జిల్లాల పరిధి వైద్యాధికారులతో సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని, బస్తీ దవాఖానాలను సమర్థంగా నడపాలని, తెలంగాణ డయాగ్నస్టిక్ సంటర్ల ద్వారా తక్షణ సేవలు అందించాలని ఆదేశించారు.