Asianet News TeluguAsianet News Telugu

కొద్ది సేపు అంతా సిగ్గుపడండి

భేషజాలొదిలేసి, కొద్ది సేపు నాగరికులంతా సిగ్గుపడాల్సిన సమయం. పేద విద్యార్థులకు దుప్పట్లు కొనేందుకు ఏలిన వారి దగ్గిర నిధుల్లేవు

Telangana has no money to supply blankets to poor students

ఇది తెలంగాణా ప్రజలంతా సిగ్గు పడాల్సిన విషయం.

 

సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు దుప్పట్లు ఇచ్చేందుకు  ప్రభుత్వం దగ్గిర నిధుల్లేవు.

 

పుష్కరాలు, బతుకమ్మ పండగలు,జాతరలు, ముఖ్యమంత్రి నివాసం, ఆకాశమెంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాం, జాతీయ పతాకం, బ్రాండ్ అంబాసిడర్లకు కోట్లు, ఏడుకొండలవాడికి కోట్లకు కోట్లు వెచ్చించిన  తర్వాత ఈ చలికాలంలో విద్యార్ధులను ఆదుకునేందుకు దుప్పట్లు  కొనలేని పరిస్థితిలో తెలంగాణా  ప్రభుత్వం పడిపోయిందంటే నమ్మలేం.

 

నమ్మాలి.

 

ఎందుకంటే, జెఎసి ఛెయిర్మన్ కోదండరామో లేదా పిసిసి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డియో లేదా రెచ్చిపోతున్న తెలుగుదేశం వర్కింగ్ ప్రెశిడెంటు రేవంత్ రెడ్డో, లేదా తెలంగాణా పాదయాత్రికుడు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రమో అంటున్న మాట కాదిది.

 

స్వయాన హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ ఎం ప్రశాంతి, అధికారులు చెబుతున్న విషయం. కొద్ది గా అలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం  ఈ సమస్య నవంబర్ 28న జరిగిన ‘మీ కోసం’ సమావేశంలో చర్చకు వచ్చింది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నన విద్యార్థులకు దుప్పట్లు కొని పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ హకుం జారీ చేశారు. అయితే, అధికారులు డబ్బుల్లేవని చేతులెత్తేశారు. చేతలెత్తితే కుదరదు, డబ్బుల్లేవని దుప్పట్లు లేవంటే వూరుకోను అని ప్రశాంతి అదేశించారు. మరేమి చేయాలి మేడం అని అధికారులడిగారు.

 

‘వెంటనే వూరిమీద పడండి. చందాలడగండి. దాతలను కలవండి....’ ఇలా నిధులు సమకూరే మార్గాలెన్నింటినో ఆమె అధికారులకు సెలవివచ్చారు.

 

ఇక సంక్షేమశాఖ అధికారులు రోడ్లెక్కారు. దుప్పట్లకోసం విరాళాలిచ్చే  దాతల కోసం వేట ప్రారంభించారు. అధికారులే అక్కడ ఇక్కడ వాకబు చేసి స్వచ్ఛంద  సంస్థలు, వితరణ శీలురు, సేవా దృక్పధం ఉన్నవారిళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వారందరికి ఫోన్ చేసి తెలంగాణా రాష్ట్రంలో నిధుల్లేక విద్యార్థులకు చలిదుప్పట్లు కొనలేక పోతున్న విషయాన్ని వివరించి వెంటనే దుప్పట్లు కొనీయాలని అడుగుతున్నారు.

 

అసలే ఉష్ణోగ్రత పడిపోయి విద్యార్థులునానా ఇబ్బంది పడుతున్నారు.  ఏ హాస్టలు కూడా చలినుంచి వారిని కాపాడే స్థితిలో లేదు.

 

 దుప్పట్లకు విరాళాలడుగుతుంటే, ప్యాలస్ లు కట్టుకునే ప్రభుత్వం దగ్గిర పేద విద్యార్థులకు దుప్పట్లు అందించేందుక డబ్బుల్లేకపోవడమేమిటని దాతలు ఎగతాళి చేస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios