పెద్దపల్లి జిల్లాలో లాయర్ వామనరావు దంపతుల హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. పట్టపగలు దారి కాచి మరి దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో లాయర్ వామనరావు, ఆయన భార్య నాగమణి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే గుంజపడుగు గ్రామంలోని ఆలయ కమిటీ వివాదంలోనే ఈ హత్యలు జరిగినట్లు చెబుతున్నారు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు న్యాయవాదుల హత్యపై లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రేపు చీఫ్ జస్టిస్‌ను కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు.

మరోవైపు ఈ జంట హత్యలు రాజకీయంగాను దుమారం రేపుతున్నాయి. వామన్ రావు దంపతుల హత్యపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డితో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడారు.

Also Read:ఆలయ కమిటీపై వివాదం.. కుంట శ్రీనుపై ప్రచారం: లాయర్ల హత్య కేసులో వాస్తవాలు

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన పోలీస్ శాఖను ఆదేశించారు. హత్యలపై పకడ్బందీగా దర్యాప్తు చేపట్టాలని నార్త్ జోన్ ఐజీ, రామగుండం సీపీనీ డీజీపీ ఆదేశించారు.

హత్యకు కొన్ని గంటలకు ముందు కుంట శ్రీను, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు కార్యక్రమంలో పాల్గొన్నారు. మధు మాట్లాడుతుండగానే ఆయన వెనకాలే వున్నారు. వామన్ రావు హత్య కేసులో ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేశారు మృతుడి కుటుంబసభ్యులు. ప్రధానంగా కుంట శ్రీను, వసంతరావు, అక్కపల్లె కుమార్‌లను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.