తెలంగాణలో కరోనా వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం కరోనాకు సంబంధించిన బులెటిన్‌ను విడుదల చేసింది.

Also Read:తెలంగాణలో కరోనా : గాంధీలో మాస్క్‌ల కొరత.. భయాందోళనలో రోగులు

ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కరోనా పాజిటివ్ అని తేలిందని, ఇప్పటి వరకు 155 మందికి కరోనా టెస్టులు చేశామని పేర్కొంది. వీరిలో 118 మందికి కరోనా నెగిటివ్ అని వచ్చిందని.. మరో 36 మంది అనుమానితుల రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వం బులెటిన్‌లో తెలిపింది. 

తెలంగాణకు చెందిన ఓ 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. కంపెనీ పని మీద అతను ఫిబ్రవరి 15న దుబాయ్ వెళ్లి అక్కడ హాంకాంగ్ దేశానికి చెందిన వారితో సమావేశమయ్యాడు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకు.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు.

Also Read:ఆ ప్రచారం నమ్మొద్దు.. కరోనా వైరస్ ఇలా వ్యాపిస్తుంది: మంత్రి ఈటల

ఈ క్రమంలో అతనికి తీవ్రంగా జ్వరం రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయితే వైద్యుల సూచన మేరకు గాంధీలో చేరిన అతని రక్తనమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా కరోనా పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. దీంతో అతనిని గాంధీలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.