ఓ వైపు కరోనా గురించి ప్రపంచం మొత్తం భయపడుతూనే ఉన్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో మాత్రం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కీలకంగా వ్యవహరించే ఎన్-95 మాస్క్‌ల కొరత వేధిస్తోంది.

ఆసుపత్రికి వస్తున్న పేషేంట్లకు, వారి వెంట వస్తున్న వారికి మాస్క్‌లు లేవు. దీంతో ఆసుపత్రిలో రోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తున్నప్పటికీ.. గాంధీలో వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

Also Read:ఆ ప్రచారం నమ్మొద్దు.. కరోనా వైరస్ ఇలా వ్యాపిస్తుంది: మంత్రి ఈటల

ఆసుపత్రిలోని ఏడో ఫ్లోర్‌లో కరోనా బారినపడిన వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. దీనితో పాటు దాదాపు 29 మంది కరోనా అనుమానితులు ఉన్నారు. పరిస్ధితి ఇంత భయానకంగా ఉన్నప్పటికీ వీరిని కలవడానికి వస్తున్న వారికి మాస్క్‌లు కొరత వేధిస్తోంది.

సర్జికల్ మాస్క్‌లు పెట్టుకుంటున్నప్పటికీ అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని, ఎన్ 95 మాస్క్ మాత్రమే కరోనాను నిరోధించే శక్తి వుందని వైద్యులు చెబుతున్నారు.     

కరోనా వైరస్ కారణంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి కాబట్టి ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా 88 వేలమందికి ఈ వ్యాధి సోకిందని.. వీరిలో ఒక్క చైనా నుంచే 80 వేలమంది ఉన్నారని ఈటల చెప్పారు.

Also Read:కరోనావైరస్ ఎఫెక్ట్: నాలుగు దేశాలవారికి జారీ చేసిన వీసాలు రద్దు

గతంలో సార్స్, స్వైన్‌ఫ్లూల కంటే కూడా కరోనా కారణంగా సంభవించిన మరణాలు తక్కువేనని ఆయన స్పష్టం చేశారు. కరోనాపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు, తప్పుడు వార్తలు, దుష్ప్రచారాలు నమ్మొద్దని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు