పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు బీమా అందించే నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. సర్వీసులో ఉండగా మరణించిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షలు అందించనుంది. 

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేసిన పంచాయతీ పారిశుధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, పారిశుధ్య కార్మికులకు మరణిస్తే వారి అంత్యక్రియలకు అందించే మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్‌లు సర్వీసులో ఉండగా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షలు వచ్చే విధంగా బీమా సౌకర్యం కల్పించినట్టు డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఎల్ఐసీ ద్వారా ఈ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తారు. ఈ ఇన్సూరెన్స్ పాలసీకి ఖర్చయ్యే మొత్తం సంబంధిత గ్రామ పంచాయతీనే చెల్లించనుంది. అయితే.. ఒక్కో కార్మికుడు ఎంత మొత్తంలో పాలసీకి చెల్లించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

బీమాతోపాటు సర్వీసులో ఉండగా మరణించిన కార్మికుల అంతిమ సంస్కారాలకు ప్రస్తుతం ఇస్తున్న 5000 రూపాయల మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రూ. 10 వేలు సంబంధిత గ్రామ పంచాయతీ చెల్లించాలని డైరెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఈ రెండు పథకాలు సక్రమంగా అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు.

Also Read: తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు: రూ.1 లక్షలోపు రుణమాఫీ నిధుల విడుదల

నెలకుపైగా నిరసనలు చేసిన పంచాయతీ కార్మికులు ఇటీవలే మళ్లీ విధుల్లో చేరారు. పంద్రాగస్టు సందర్భంగా తమకు శుభవార్త అందుతుందని వారు ఎదురుచూస్తున్నారు. వారు అనుకున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు గుడ్ న్యూస్ అందించింది. వారి డిమాండ్లు అన్ని కాకపోయినా.. ముఖ్యమైన బీమా పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.