తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు: రూ.1 లక్షలోపు రుణమాఫీ నిధుల విడుదల
రూ.లక్ష లోపు రుణాలను తెలంగాణ సర్కార్ మాఫీ చేసింది. ఈ మేరకు ఇవాళ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. లక్ష రూపాయాల లోపు రుణాలను మాఫీ చేయనుంది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 10 లక్షల 79 వేల 721 మంది రైతుల రుణమాఫీ కోసం రాష్ట్రప్రభుత్వం రూ, 6,546 కోట్లను సోమవారంనాడు విడుదల చేసింది. ఈ నిధులను 99,999 రూపాయాల లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. 2018 ఎన్నికల సమయంలో రూ. లక్ష రూపాయాల పంట రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ హామీ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిధులను విడుదల చేసింది.
ఇప్పటి వరకు 16.66 లక్షల మంది రైతులకు రుణమాఫీని పూర్తి చేసింది ప్రభుత్వం. 45 రోజుల్లో పంట రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ ఆర్ధిక శాఖాధికారులు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే నిధులను సమకూర్చుకుంటున్నారు. నిధులు సమకూరిన తర్వాత విడుదల చేస్తున్నారు. లక్ష రూపాయాల లోపు రుణాల మాఫీకి సంబంధించి అవసరమైన నిధులను సమకూరడంతో ఇవాళ ఒక్కరోజే రూ. 6 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు.
పంట రుణ మాఫీకి సంబంధించి కేసీఆర్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు చేసేవారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కేసీఆర్ సర్కార్ పంట రుణ మాఫీని పూర్తి చేయాలని నిర్ణయంతీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయినా కూడ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కే పట్టం కట్టారు.ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను పురస్కరించుకొని ప్రజలకు ఏఏ సంక్షేమ పథకాలను అమలు చేయనున్నామో పార్టీలు ఇప్పటికే ప్రకటనలు గుప్పిస్తున్నాయి.
రానున్న రోజుల్లో విడుదల చేసే మేనిఫెస్టోల్లో ఈ విషయమై మరింత స్పష్టత రానుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలను బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లుప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హ్యట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. 10 ఏళ్ల తర్వాత అధికారం కోసం కాంగ్రెస్ వ్యూహా రచన చేస్తుంది. తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ కసరత్తు చేస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడుతారో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. అయితే ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీలు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి.