ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. వారికి రాజ్‌భవన్ అండగా వుంటుందని ప్రభుత్వంతో పాటు యూనివర్సిటీలలో పలు సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చే విద్యార్ధులను రాజ్‌భవన్ సంప్రదిస్తోందన్నారు. 

యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. తెలంగాణ యువత ఎలాంటి ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో వారికి రాజ్‌భవన్ అండగా వుంటుందని తమిళిసై పేర్కొన్నారు. రాజ్‌భవన్ ద్వారా చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సీపీఆర్ ఛాలెంజ్, రక్తదాని శిబిరాలు, పూర్వ విద్యార్ధులను ఒక చోటకి చేర్చే ఛాన్సెలర్ వంటి కార్యక్రమాలను రాజ్‌భవన్ చేపట్టిందని తమిళిసై వివరించారు. ప్రభుత్వంతో పాటు యూనివర్సిటీలలో పలు సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చే విద్యార్ధులను రాజ్‌భవన్ సంప్రదిస్తోందన్నారు. 

ఇదిలావుండగా.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి గత వారం తమిళిసై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శనివారం జేఎన్‌టీయూహెచ్ స్నాతకోత్సవానికి హాజరైన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు విద్యార్ధులకు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేవారని తమిళిసై అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రశ్నాపత్రాలు ఎక్కడ తయారవుతాయో వెతుకుతున్నారని ఇది దురదృష్టకరమని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పరీక్షలకు హాజరైతే చాలని విద్యార్ధులు అనుకుంటున్నారని తమిళిసై వ్యాఖ్యానించారు.

ALso Read: 'పెండింగ్ బిల్లుల పురోగతి తెలుసుకుంటా': తమిళిసైపై కేసీఆర్ సర్కార్ పిటిషన్ పై విచారణ ఈ నెల 27కి వాయిదా

మరోవైపు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించడం లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. అయితే ఈ విషయమై గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా స్పందించారు. ఏం జరుగుతుందో తెలుసుకుంటానని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఈ మధ్యే వచ్చాయని సుప్రీం కోర్టుకు తుషార్ మెహతా తెలిపారు.