'పెండింగ్ బిల్లుల పురోగతి తెలుసుకుంటా': తమిళిసైపై కేసీఆర్ సర్కార్ పిటిషన్ పై విచారణ ఈ నెల 27కి వాయిదా
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై కేసీఆర్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించడం లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై సోమవారంనాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. అయితే ఈ విషయమై గవర్నర్ తరపున స్పందించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా స్పందించారు. ఏం జరుగుతుందో తెలుసుకుంటానన్న తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఈ మధ్యే వచ్యాయని సుప్రీం కోర్టుకు తుషార్ మెహతా తెలిపారు.
మరో వైపు తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై కేంద్రం అభిప్రాయాన్ని కోరింది సుప్రీంకోర్టు. అయితే ఈ విషయమై కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు సమయం కావాలని సొలిసిటర్ జనరల్ కోరారు. మరో వైపు గవర్నర్ కు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల ఆమోదంపై పురోగతిని తెలుసుకుని చెబుతానని సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ చెప్పారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
యూనివర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు కామన్ బోర్డు ఏర్పాటు,ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్టసవరణ, జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ,ములుగులో ఫారెస్ట్ పరిశోధన సంస్థ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం, జీఎస్టీ చట్ట సవరణ, ఆజామాబాద్ పారశ్రామిక ప్రాంత చట్టం వంటి బిల్లులు రాజ్ భవన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి.
ఈ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. అయితే ఈ బిల్లులను అధ్యయనం చేస్తున్నట్టుగా గతంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రకటించిన విషయం తెలిసిందే. యూనివర్శిటీల్లో నియామకాల విషయంలో కామన్ బోర్డు ఏర్పాటు అంశానికి సంబంధించి యూజీసీతో కూడా గవర్నర్ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.
also read:తమిళిసైపై సుప్రీంకోర్టుకు కేసీఆర్ సర్కార్: 10 బిల్లులు ఆమోదం కోసం పిటిషన్
ఈ ఏడాది జనవరి 31న బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పటిషన్ పై విచారణ నిర్వహించే సమయంలో హైకోర్టు సూచన మేరకు రాజ్ భవన్, ప్రగతి భవన్ న్యాయవాదులు చర్చించుకున్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. దీంతో ప్రభుత్వం తన పిటిషన్ ను వెనక్కు తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు.