టీఎస్ఆర్టీసీ బిల్లుపై మరోసారి వివరణ కోరిన తమిళిసై: అధికారులను పంపాలని ఆదేశం
టీఎస్ ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ఆర్టీసీ అధికారులను వివరణ కోరారు.
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తాత్కాలిక ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారో తెలపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారనే విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారులను గవర్నర్ కోరారు. ఈ మేరకు ఆదివారంనాడు ఆర్టీసీ అధికారులను కోరారు. ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులను తన వద్దకు పంపాలని గవర్నర్ ఆదేశించారు.
ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందనే విషయమై శనివారంనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వివరణ కోరారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ ఉదయం గవర్నర్ కు సమాధానం పంపారు. ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లు విషయమై ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడారు.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్ భవన్ కు రావాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగుల విషయమై ఏం చర్యలు తీసుకొంటారో స్పష్టత ఇవ్వాలని గవర్నర్ కోరారు.ఈ విషయమై తనతో చర్చించేందుకు రావాలని గవర్నర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఇవాళ మధ్యాహ్నం ఆర్టీసీ ఉన్నతాధికారులు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో భేటీ కానున్నారు.ఈ భేటీలో గవర్నర్ లేవనెత్తే అంశాలపై అధికారులు సమాధానం ఇవ్వనున్నారు.ఈ సమావేశం తర్వాత ఆర్టీసీ డ్రాఫ్ట్ బిల్లుపై గవర్నర్ నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు గవర్నర్ నుండి ఆర్టీసీ బిల్లుపై స్పష్గత రాకపోతే ప్రభుత్వం ఏం చేయనుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ సాయంత్రం లోపుగా గవర్నర్ టీఎస్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపితే అసెంబ్లీ సమావేశాలను రేపటి వరకు పొడిగిస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
తెలంగాణ ఆర్టీసీ బిల్లు విషయమై నిన్న మధ్యాహ్నం ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బిల్లు విషయమై ఆమె వారితో మాట్లాడారు. కార్మిక సంఘాలతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వాన్ని రెండు దఫాలు పలు ప్రశ్నలు అడిగారు. ఇవాళ మరోసారి ఈ విషయమై వివరణ ఇచ్చేందుకు రావాలని అధికారులను గవర్నరర్ ఆదేశించారు.