తమిళనాడు, తెలంగాణ సీఎంలు ఎంకే స్టాలిన్, కేసీఆర్‌లను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదని ఆమె అన్నారు.
తమిళనాడు, తెలంగాణ సీఎంలు ఎంకే స్టాలిన్, కేసీఆర్‌లను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై స్పందించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తాను పుదుచ్చేరిలో చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ డొమైన్‌లో వున్నాయన్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని గవర్నర్ వ్యాఖ్యానించారు. బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదని ఆమె అన్నారు.
కాగా.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరికి వెళ్లిన తమిళిసై ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరుకాకపోవడంపై స్పందించారు. గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు ముఖ్యమంత్రి గైర్హాజరు కావడం మంచిది కాదన్నారు. స్టాలిన్ రాకపోవడం బాధాకరమని తమిళిసై పేర్కొన్నారు. ఇదే సమయంలో కేసీఆర్‌పైనా ఆమె స్పందించారు. ఎట్‌హోం కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించామని.. రావడం , రాకపోవడం అనేది రాజ్‌భవన్ పరిధిలో లేదన్నారు.
Also Read: రాజ్‌భవన్‌లో ఎట్‌హోం.. కేసీఆర్ గైర్హాజరు, కనిపించని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
అయితే అనుకున్నట్లుగానే రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోమ్ కార్యక్రమానికి కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రామానికి దూరంగా వున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఎవ్వరూ ఎట్‌హోం కార్యక్రమంలో కనిపించలేదు. గత కొంతకాలంగా రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి కీలకమైన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తమిళిసై తన వద్దే వుంచుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఆమెపై గుర్రుగా వున్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం కోసం పంపించింది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాతే.. చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. బిల్లుల విషయానికి వస్తే.. గతంలో గవర్నర్ తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన ఒక బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి మళ్లీ గవర్నర్ వద్దకు పంపారు. ఈ జాబితాలో తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు- 2022, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, నియంత్రణ సవరణ బిల్లు- 2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్ సవరణ బిల్లు- 2022, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు- 2022 ఉన్నాయి.
