రాజ్‌భవన్‌లో ఎట్‌హోం.. కేసీఆర్ గైర్హాజరు, కనిపించని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం జరిగింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రామానికి దూరంగా వున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రామానికి దూరంగా వున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు ఎవ్వరూ ఎట్‌హోం కార్యక్రమంలో కనిపించలేదు. గత కొంతకాలంగా రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి కీలకమైన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తమిళిసై తన వద్దే వుంచుకోవడంతో ప్రభుత్వ పెద్దలు ఆమెపై గుర్రుగా వున్నారు.
కాగా.. తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళిసైకి సంబంధించిన ప్రోటోకాల్, బిల్లుల క్లియరెన్స్, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ఇలా చాలా విషయాలు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారాయి. గతంలో ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య పెండింగ్ బిల్లల పంచాయితీ.. సుప్రీం కోర్టు వరకు కూడా చేరింది. అయితే అప్పటికీ ఆ వివాదం సద్దుమణిగినప్పటికీ.. ఇప్పుడు మరోసారి బిల్లులకు ఆమోదం అంశం మరోసారి అగ్గిరాజేసే అవకాశం కనిపిస్తుంది.
ALso Read: గవర్నర్ తమిళిసై వద్దే 12 బిల్లులు.. మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రాజ్‌భవన్ లొల్లి తప్పదా?
ఇటీవల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆమోదం కోసం పంపించింది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాతే.. చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. బిల్లుల విషయానికి వస్తే.. గతంలో గవర్నర్ తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన ఒక బిల్లును ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలిపి మళ్లీ గవర్నర్ వద్దకు పంపారు. ఈ జాబితాలో తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు- 2022, తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, నియంత్రణ సవరణ బిల్లు- 2022, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్ సవరణ బిల్లు- 2022, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు- 2022 ఉన్నాయి.