పెద్ద నోట్లను స్వీకరించనున్న టిఎస్ దేవుళ్లు రద్దయిన నోట్లతో చెల్లింపులకు దేవాదాయ శాఖ అనుమతి తెలంగాణలో భక్తులకు తప్పిన ఇక్కట్లు
యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి, వేములవాడ రాజన్న, కొమరవెల్లి మల్లన్న ఇలా తెలంగాణలోని అందరి దేవుళ్లకు ఇకపై మీ దగ్గర ఉన్న చెల్లని నోట్ల( రద్దయిన పెద్ద నోట్లు) తో భక్తి పూర్వకంగా చెల్లింపులు జరుపుకోవచ్చు.
అంతేకాదు పెద్ద నోట్లు హుండీలో వేసి మొక్కులు చెల్లించుకోవచ్చు. అలాగే, ప్రసాదం కొనుగోళ్లు, ప్రత్యేక దర్శనం టికెట్లు, కల్యాణం ఇతర పూజాది కార్యక్రమాలకు కూడా పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతాయి.
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కార్తీక మాసం సందర్భంగా అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాల వద్ద పెద్ద నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి వస్తే పెద్ద నోట్లు చెల్లక పోవడంతో దైవదర్శనం అవకుండా ఇంటిముఖం పట్టినవారు ఎందరో..
దీంతో భక్తుల ఇబ్బందులు గ్రహించిన తెలంగాణ దేవాదాయ శాఖ ఇప్పుడు భక్తులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు తెలంగాణలోని అన్ని దేవాలయాల్లో పెద్ద నోట్లు చెల్లుబాటు అయ్యేలా అనుమతి ఇచ్చింది.
ఈ నిర్ణయం వల్ల భక్తుల ఇబ్బందులు తప్పడంతో పాటు దేవాలయాల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
