మెదక్ అడవుల్లో గంటపాటు దారి తప్పిన మంత్రి జోగు రామన్న మంత్రితో పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మథన్ రెడ్డి అడవుల్లో హరితహారం కార్యక్రమంలో 8 కిలోమీటర్లు నడిచిన జోగురామన్న
ఆయన తెలంగాణ రాష్ట్రానికి అటవీ శాఖ మంత్రి. అడవులను పరిపుష్టం చేసేందుకు అడవుల్లో పర్యటనకు కదిలారు. కానీ అడవుల్లో దారి తప్పి ఎక్కడెక్కడో తిరిగారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. వివరాలివి.
హరితహారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ అడవిలోని ఖాళీ ప్రదేశంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ మంత్రి జోగురామన్న, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ భారతి హొళికెరి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు 8 కి.మీ. కాలిబాటన వెళ్లాల్సి వచ్చింది. వాగులు, వంకలు, పొదలు లో రెండు కి.మీ. దూరంలో మొక్కలు నాటేకార్యక్రమం తొలుత చేపట్టారు. అడవిలో మొక్కలు నాటిన అనంతరం భోజనాలు ఏర్పాటు చేసిన చోటకు కాలినడకన బయలుదేరిన మంత్రి జోగు, ఎమ్మెల్యే మథన్ రెడ్డి ఇద్దరూ దారి తప్పిర్రు. గంటపాటు అటు ఇటు తిరిగి తిరిగి చివరకు భోజనాలు ఏర్పాటు చేసిన చోటకు వారు చేరుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అడవుల్లో హరిత హారం పేరుతో జరిపిన ఈ యాత్రలో మంత్రి మొత్తం రాను పోను కలిపి ఎనిమిది కి.మీ. దూరం నడిచారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచే కార్యక్రమం ఇటీవలే మొదలైంది. మొన్న మహిళా కలెక్టర్లు అమ్రపాలి, ప్రీతిమీనా లు 12 కిలోమీటర్ల మేర అడవుల్లో నడిచి హల్ చల్ చేశారు. అదే క్రమంలో అటవీ మంత్రి కూడా అడవుల్లో నడిచారు. ఆ కలెక్టరమ్మలు సేఫ్ గా వచ్చారు కానీ... అటవీ మంత్రి కొద్దిసేపు దారి తప్పడం చర్చనీయాంశమైంది.
