హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబుర్జు ఆసుపత్రిలో మరణించిన మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోలేదన్నారు తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి. ఆ మహిళ జ్వరం వల్లే ప్రాణాలు కోల్పోయిందని డీఎంఈ తెలిపారు.
హైదరాబాద్ పాతబస్తీలోని పేట్లబుర్జు ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల చనిపోలేదని.. జ్వరం వల్లే ప్రాణాలు కోల్పోయిందని డీఎంఈ తెలిపారు. మహిళకు ట్యూబెక్టమీ చేయలేదని.. సిజేరియన్ జరిగిందని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. మహిళకు ఆపరేషన్ జరిగిన రోజే మరో 9 మందికి సర్జరీ జరిగిందని ఆయన పేర్కొన్నారు. 9 మందిలో మరో ఇద్దరికి వైరల్ ఫీవర్ వచ్చిందని.. వారి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే వుందని రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యులతో భేటీ అయినట్లు డీఎంఈ తెలిపారు.
Also REad:హైద్రాబాద్ పేట్ల బురుజు ఆసుపత్రిలో కు.ని. శస్త్రచికిత్స ఆపరేషన్ ఫెయిల్: మహిళ మృతి
కాగా... పేట్లబురుజు ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఓ మహిళ అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే స్థానిక వైద్యుల సూచన మేరకు బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిందింది. ఇటీవలే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.
