తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు . కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన ఆయన తర్వాత క్షుద్రపూజల్లో పాల్గొన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత క్రైస్తవ మతం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా శ్రీనివాసరావు జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదమైంది.
తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు మరో వివాదంలో ఇరుక్కున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు వారి వారి కార్యాలయాల్లో మొక్కలు నాటాలన్నారు. అలాగే రోగులకు పండ్లు పంపిణీ చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి సర్క్యూలర్ జారీ చేశారు డీహెచ్ శ్రీనివాసరావు.
కాగా.. శ్రీనివాసరావు త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కొంతకాలంగా ప్రయత్నాలు చేసుకుంటున్న శ్రీనివాసరావు.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరాలనే తన కోరికను వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే.. వీఆర్ఎస్ తీసుకుని అధికారికంగా బీఆర్ఎస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం.
ALso REad: రాజకీయాల్లో ఎంట్రీకి సిద్దమవుతున్న డీహెచ్ శ్రీనివాసరావు.. బీఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమేనా..?
కొత్తగూడెం నుంచి బరిలో నిలవాలనే ఆలోచనతో ఉన్న శ్రీనివాసరావు.. ఇప్పటికే నియోజకవర్గంలో తన తండ్రి పేరుతో ఉన్న గడల సూర్యనారాయణ రావు (GSR) ట్రస్టు పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కాలంగా వీలు దొరికినప్పుడల్లా కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్‌లో తనకంటూ ఓ వర్గాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. మరోవైపు శ్రీనివాసరావు.. కేసీఆర్ దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని నెలల కిందట ప్రభుత్వ అధికారిగా ఉన్న డీహెచ్ శ్రీనివాసరావు.. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియో వైరల్ అయింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. శ్రీనివాసరావు మాత్రం తన చర్యను సమర్ధించుకున్నారు.
వెంకట్రామి రెడ్డి బాటలోనే.. కానీ..
సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వెంకటరామిరెడ్డి.. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కరించడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన చోటుచేసుకను్న కొన్ని నెలలకే.. వెంకటరామిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి 2021 నవంబర్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే శ్రీనివాసరావు మాత్రం.. బీఆర్ఎస్‌లో చేరాలని భావిస్తున్న ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
కొత్తగూడెంపై హామీ లభిస్తుందా..?
డీహెచ్ శ్రీనివాసరావు కొత్తగూడెంకు చెందినవారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాసరావు.. పబ్లిక్ హెల్త్‌లో పీజీ పట్టా పొందారు. కోవిడ్ సమయంలో తన తండ్రిని కోల్పోయిన శ్రీనివాసరావు.. ఆయన పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొత్తగూడెం నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు, పేద పిల్లలకు ఆర్థిక సహాయం వంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
