Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లో ఎంట్రీకి సిద్దమవుతున్న డీహెచ్ శ్రీనివాసరావు.. బీఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమేనా..?

తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ (డీహెచ్) శ్రీనివాసరావు త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 

DH Srinivasa Rao set for political entry may resign soon and likely to join BRS ksm
Author
First Published Jan 17, 2023, 10:02 AM IST

తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ (డీహెచ్) శ్రీనివాసరావు త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన త్వరలోనే బీఆర్ఎస్‌ పార్టీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కొంతకాలంగా ప్రయత్నాలు చేసుకుంటున్న శ్రీనివాసరావు.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరాలనే తన కోరికను వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. కేసీఆర్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే.. వీఆర్ఎస్ తీసుకుని అధికారికంగా బీఆర్ఎస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం. 

కొత్తగూడెం నుంచి బరిలో నిలవాలనే ఆలోచనతో ఉన్న శ్రీనివాసరావు.. ఇప్పటికే నియోజకవర్గంలో తన తండ్రి పేరుతో ఉన్న గడల సూర్యనారాయణ రావు (GSR) ట్రస్టు పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది కాలంగా వీలు దొరికినప్పుడల్లా కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్‌లో తనకంటూ ఓ వర్గాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. మరోవైపు శ్రీనివాసరావు.. కేసీఆర్ దృష్టిలో పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని నెలల కిందట ప్రభుత్వ అధికారిగా ఉన్న డీహెచ్ శ్రీనివాసరావు.. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియో వైరల్‌ అయింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. శ్రీనివాసరావు మాత్రం తన చర్యను సమర్ధించుకున్నారు. 

అయితే ఖమ్మంలో ఈ నెల 18న బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలోనే గులాబీ కండువా కప్పుకునేందుకు శ్రీనివాసరావు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. అయితే కొన్ని విషయాలపై బీఆర్ఎస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడం, ఇంకా వీఆర్ఎస్ తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల.. ఆయన చేరిక మరింత ఆలస్యం కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే బీఆర్ఎస్‌లో చేరకపోయినప్పటికీ.. ఖమ్మంలో నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు తెరవెనక తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం కూడా సాగుతుంది. 

DH Srinivasa Rao set for political entry may resign soon and likely to join BRS ksm

కొత్తగూడెంపై హామీ లభిస్తుందా..?
డీహెచ్ శ్రీనివాసరావు కొత్తగూడెంకు చెందినవారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాసరావు.. పబ్లిక్ హెల్త్‌లో పీజీ పట్టా పొందారు. కోవిడ్ సమయంలో తన తండ్రిని కోల్పోయిన శ్రీనివాసరావు.. ఆయన పేరుతో ఉన్న ట్రస్టు ద్వారా కొత్తగూడెం నియోజకవర్గంలో వైద్య శిబిరాలు, జాబ్ మేళాలు, పేద పిల్లలకు ఆర్థిక సహాయం వంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. 

ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు. అయితే వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేందర్ రావు.. ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో రాఘవేందర్ అరెస్ట్ కూడా అయ్యాయరు. అప్పటి నుంచి వనమా వెంకటేశ్వరరావుపై అధిష్టానం అసంతృప్తిగా ఉందనే ప్రచారం  కూడా సాగుతుంది. మరోవైపు తాను బీఆర్ఎస్ టికెట్‌పై కొత్తగూడెం నుంచి బరిలోకి దిగడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని వెంకటేశ్వరరావు తన అనుచరులతో చెబుతున్నారు. 

మరి కొత్తగూడెం నుంచే బరిలో నిలవాలని భావిస్తున్న శ్రీనివాసరావు.. అక్కడి నుంచి టికెట్ తెచ్చుకుంటారా? అనేది ఇప్పుడు స్థానిక బీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. డైరెక్ట్‌గా కేసీఆర్‌ ఆశీస్సులతోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న శ్రీనివాసరావు.. తాను కోరిన విధంగా కొత్తగూడెం టికెట్ దక్కించుకుంటారా? లేదా? అనేది చూడాల్సి ఉంది. 

వెంకట్రామి రెడ్డి బాటలోనే.. కానీ..
సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన వెంకటరామిరెడ్డి..  ఆ సమయంలో సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కరించడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన చోటుచేసుకను్న కొన్ని నెలలకే.. వెంకటరామిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి 2021 నవంబర్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే శ్రీనివాసరావు మాత్రం.. బీఆర్ఎస్‌లో చేరాలని భావిస్తున్న ఆయన ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios