తెలంగాణలో నైట్ కర్ఫ్యూకి సహకరించాలని కోరారు డీజీపీ మహేందర్ రెడ్డి. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన పోలీసు జోనల్ ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాత్రి వేళ కర్ఫ్యూ పటిష్ఠంగా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని మహేందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. కర్ఫ్యూ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీజీపీ సూచించారు.

స్వీయరక్షణకు ఎంత బాధ్యతగా ఉంటామో సమాజ శ్రేయస్సు విషయంలోనూ అంతే బాధ్యతగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. జీవోలో పేర్కొన్న నిబంధనల ప్రకారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు విధిగా కర్ఫ్యూ అమలు చేయాలని డీజీపీ కోరారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

కర్ఫ్యూ సమయంలో పౌరులతో దురుసుగా ప్రవర్తించరాదని పోలీసులను ఆదేశించారు. అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలన్నింటినీ రాత్రి 8 గంటల కల్లా మూసివేసేలా చూడాలని మహేందర్ రెడ్డి కోరారు.

జీవోలో స్పష్టంగా ఉన్నందున మినహాయింపు ఉన్నవారు సెల్ఫ్ ఐడెంటిటీ కార్డు చూపించాలని.. అలాగే గూడ్స్ వాహనాలను ఆపకూడదని పోలీసులను ఆదేశించారు. తమ పరిధిలోని వివిధ సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో కర్ఫ్యూ నిబంధనలపై సమావేశం నిర్వహించి చైతన్య పర్చాలి డీజీపీ సూచించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసే ఆదేశాలను తప్పకుండా పాటించాలని మహేందర్ రెడ్డి ఆదేశించారు.