కర్ణాటకలో మంచి విజయంతో కాంగ్రెస్ ఊపు మీద ఉన్నది. అదే జోరు కొనసాగిస్తే తెలంగాణలోనూ అధికారానికి వచ్చే అవకాశాలు లేకపోలేదని ఆ నేతల్లో విశ్వాసం ఏర్పడుతున్నది. నిన్న మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీల్లో హడావిడి చేసిన బీజేపీ మాత్రం అంతర్గత వర్గపోరుతో బలహీనమవుతున్నది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ 2కు చేరి తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటామని ఆశపడ్డ బీజేపీ మాత్రం ఎన్నికల ముంగిట్లో బలహీనపడినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగల, ప్రత్యామ్నాయంగా నిలిచే పార్టీ కాంగ్రెస్సే అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లుతున్నదని అంటున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. రాష్ట్రం ఇచ్చిందే మేం.. మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ కాంగ్రెస్ అధికారం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. కర్ణాటక విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్రంగానే ప్రభావం ఉన్నా.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీ మంచి దూకుడును చూపించింది. ఇప్పటి వరకు ఉన్న తీరు ఇది. కానీ, ఎన్నికల సంవత్సరంలో చాలా మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయని తెలిసిందే. తెలంగాణలోనూ ఇది స్పష్టంగా కనిపిస్తున్నది.
ఉప ఎన్నికల ఫలితాలతో అధికార బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడిన బీజేపీ ఇప్పుడు కొంచెం ఢీలా పడ్డట్టు కనిపిస్తున్నది. ఈ దూకుడు మీదే రాష్ట్రంలో తాము ప్రధాన ప్రతిపక్షం అని బీజేపీ చెప్పుకుంది. కానీ, గత కొన్ని రోజులుగా రాజకీయ పరిణామాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్గత పోరుతో బీజేపీలో వర్గాలు ఏర్పడగా.. కర్ణాటక అసెంబ్లీలో ఘన విజయంతో కాంగ్రెస్ ఊపందుకున్నది.
తెలంగాణ టార్గెట్‌గా బీజేపీ ఎన్నో ఎత్తులు వేసింది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణే అన్నట్టుగా ఇక్కడ నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతోనూ ఒక సంకేతం వచ్చింది. కానీ, తెలంగాణ బీజేపీ కొందరు నేతల్లో బండి సంజయ్ నాయకత్వంపై అసంతృప్తి నెలకొంది. ఈటెల రాజేందర్ మొదలు ధర్మపురి అర్వింద్ వరకు ఈ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు చేస్తారనే వాదనలు వచ్చినా.. ఎన్నికల ముంగిట్లో ఈ నిర్ణయం సరికాదని మిన్నకుండినట్టు తెలిసింది.
Also Read: విపక్షాల ఐక్యత కార్యరూపం దాల్చేనా?.. ఆ పార్టీలకు రాష్ట్రాలనే వదిలిపెట్టాలా?.. డైలామాలో కాంగ్రెస్!
ఢిల్లీ లిక్కర్ కేసులోనూ కవితను తప్పకుండా అరెస్టు చేస్తామన్నట్టుగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు మెత్తబడటంతో ప్రజల్లోనూ అనుమానాలు రేకెత్తాయి. కవితను అరెస్టు చేయకపోవడం తమకు చేటే చేసిందని బీజేపీ నేతలే చెబుతున్నారు. రాష్ట్రంలో మార్పు కోరుకునే వారు.. బీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉన్నవారు దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీకి బదులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వాదనలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నాయకత్వంలో ఉత్తేజం రావడం, హిమాచల్ ప్రదేశ్ మొదలు కర్ణాటక వరకు కాంగ్రెస్ విజయాలు తెలంగాణలోనూ ప్రభావం వేశాయి. తెలంగాణలోనూ టీపీసీసీ నేతలు యాత్రలు చేసి జనంలోకి వెళ్లుతున్నారు.
ఈ మారిన పరిస్థితుల్లోనే ఆశావహులు కాంగ్రెస్ వైపు దృష్టి సారిస్తున్నారు. అందుకే పార్టీ మారుతున్న నేతలు, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ప్రత్యేకంగా చేరికల కమిటీ వేసి, దానికి అప్పుడు ఆ పార్టీలో చేరిన ఈటెల రాజేందర్‌ను చీఫ్‌ను చేసినా చేరికలు పెద్దగా జరగలేవు. అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్న ఈటెల బలమైన నాయకుడు కావడంతో చాలా మందిని పార్టీలోకి తీసుకు వస్తారని బీజేపీ భావించింది. కానీ, తనకే రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఈటెల అనడంతో బీజేపీలో చేరికలు దాదాపు అసాధ్యమే అనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి.
Also Read: కేసీఆర్, ఓవైసీల ఫ్రెండ్షిప్ వెనుక లెక్కలు ఇవే.. ముస్లిం ఓట్లతో ఆ పార్టీకి చెక్?
జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు తొలుత బీజేపీలో చేరుతారనే వాదనలు జోరుగా సాగినా.. చివరకు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని తెలుస్తున్నది. వీరిద్దరూ టీ కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని సమాచారం. వీరి ప్రాధాన్యాలు మారడం కూడా టీ కాంగ్రెస్ పై విశ్వాసాలను పెంచుతున్నది. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అవుతుందని, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే బలంగా పోరాడుతున్నదనే అభిప్రాయాలు ప్రజల్లో మెల్ల మెల్లగా ఇంకుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో గత ఎన్నికల తరహాలోనే ఈ సారి కూడా బీజేపీ మూడో స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయప డుతున్నారు.
