తెలంగాణలో కేసీఆర్, ఓవైసీల ఫ్రెండ్షిప్ రాష్ట్ర ఆవిర్భవించినప్పటి నుంచే ఉన్నది. తొలి ఎన్నికలు, రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత ఉన్నది. ఈ ఫ్రెండ్షిప్ వెనుక లెక్కలు ఉన్నాయి. ఈ సారి వీరి ఫ్రెండ్షిప్ కొనసాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆ మైత్రి వల్ల కలిగే ప్రయోజనాలపైనా అంచనాలు ఉన్నాయి. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాజకీయ సమీకరణాలే కాదు.. వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఎవరి ఓటు బ్యాంకు ఏదీ? ఏ పార్టీని ఎలా ఎదుర్కోవాలి? ఎలా ఉనికి కాపాడుకోవాలి? లేదా ఎలా గెలిచి తీరాలి? వంటి అంశాలపై మేధమథనం జరుగుతూనే ఉన్నది. సర్వేలు పెద్ద ఎత్తున చేసుకుంటూనే ఉన్నాయి. 

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. ఆ పార్టీ మినహా మరే పార్టీ కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అధికారంలోకి రాలేదు. కాబట్టి, మిగిలిన పార్టీలు గొప్పలు చెప్పుకునే అవకాశాలు దాదాపు లేవు. ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, ప్రతి పార్టీకి సాంప్రదాయ ఓటర్లు కొందరు ఉంటారు. వాటిపైనా అవి ఫోకస్ పెడుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్నది. కర్ణాటక ఎన్నికల విజయంతో ఈ పార్టీలో మనోస్థైర్యం పెరిగింది. చేరికలతోనూ బలమైన పార్టీగా సంకేతాలు ఇస్తున్నది. మరో వైపు బీజేపీ తన ప్రయత్నం తాను చేస్తూ ఉన్నది. మరో ‘ప్రతిపక్ష పార్టీ’ ఎంఐఎం. లెఫ్ట్ పార్టీలు, వైఎస్సార్టీపి, టీడీపీల ప్రభావంపై ఇప్పుడే అంచనాలు వేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లను ఒకే స్థాయికి చేర్చి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయేలా చేస్తే తమ గెలుపు ఖాయమనే బీఆర్ఎస్ వ్యూహం బహిరంగమే. ఈ బ్యాలెన్సింగ్ పనిలో ఎంఐఎం పార్టీని కూడా బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. బీజేపీని పెంచాలన్నా.. కాంగ్రెస్‌ను దించాలన్నా ఎంఐఎం ఉపయోగపడుతుందనే వాదనలు ఉన్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఓవైసీ, కేసీఆర్‌ల మధ్య దోస్తీ గురించి కూడా చర్చ జరుగుతున్నది.

Also Read: శివసేన, బీజేపీల మధ్య విభేదాలు!.. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావా?: బీజేపీ

గతంలో కాంగ్రెస్‌తో చేసుకున్న లోపాయికారి ఒప్పందమే ఇప్పుడు బీఆర్ఎస్‌తో నడుస్తున్నట్టు అర్థం అవుతున్నది. ఓల్డ్ సిటీలో నన్ను ముట్టుకోవద్దు.. మిగితా చోట్ల మిమ్మల్ని ముట్టుకోను. మనిద్దరి ఓటర్లను ఏకం చేద్దాం. ఇదే ఆ సూత్రం. ఓల్డ్ సిటీలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించదని కాదు. కానీ, ఆ అభ్యర్థులను బీఆర్ఎస్, ఎంఐఎం సీరియస్‌గా తీసుకోరు. ఆ అభ్యర్థులనూ ప్రకటించడం ఎందుకంటే ఎంఐఎం పార్టీ ప్రతిపక్షం అని చెప్పడానికే అని కూడా కొందరు అంటుంటారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్‌ వైపు నిలిచేలా ఎంఐఎం ప్రయత్నం చేస్తుంది. అంతేనా.. ఏ స్థానంలోనైనా కాంగ్రెస్ పైచేయి సాధించే అవకాశం ఉంటే.. అక్కడా ఎంఐఎం అభ్యర్థిని ప్రకటిస్తే.. ముస్లిం ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ గెలిచే మరో ప్రయోజనం కూడా అధికార పార్టీకి ఉంటుంది. 

బీజేపీ వ్యతిరేక ఓట్లు స్థానిక పార్టీలకు పడటం కొంత కష్టమే. ఇటీవలి కాలంలోని పరిణామాలు ఈ మార్పును తెస్తున్నట్టు అర్థం అవుతున్నది. కర్ణాటకలో ముస్లిం ఓట్లు పొందిన జేడీఎస్.. బీజేపీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూస్తూనే ఉన్నాం. అందుకే స్థానిక పార్టీలు బీజేపీకి ఎల్లప్పుడూ వ్యతిరేకంగానే నిలబడి ఉండాల్సిన పని లేదు. కానీ, కాంగ్రెస్ స్టాండ్ అదికాదు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ కచ్చితంగా ఉండి తీరుతుంది.

ఈ మధ్య కేసీఆర్.. బీజేపీపై దాడిని కొంత చల్లబర్చడంతో ముస్లిం ఓటర్లూ డైలమాలో పడుతున్నారు. ముస్లింలు ఆచితూచి.. ముప్పేమీ లేదనే నిర్దారణకు వచ్చాకే బీఆర్ఎస్‌కు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి.