హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కొనే అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. 

గత నెలలో అనారోగ్యంతో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. సోలిపేట రామలింగారెడ్డి కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరిని టీఆర్ఎస్ బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. 

also read:దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు: కేసీఆర్‌కి కొత్త తలనొప్పులు

ఈ స్థానంలో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దుబ్బాక అసెంబ్లీ స్థానంలోని పార్టీ క్యాడర్ ను ఉత్సాహపర్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. నియోజకవర్గంలోని మండల, గ్రామ కమిటీలను పూర్తి చేయనున్నారు. 

ఇప్పటివరకు స్థబ్ధుగా ఉన్న కమిటీలను యాక్టివ్  చేయడానికి పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. ఎన్నికల నాటికి పార్టీ క్యాడర్ ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా ఇప్పటినుండే నాయకత్వం సంస్థాగత ప్రక్రియను ప్రారంభించింది.

also read:దుబ్బాక ఉప ఎన్నిక: అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు

నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎవరు... పార్టీ నేతలుగా ఉంటూ పార్టీ కోసం సమయం కేటాయించని వారెవరు అనే విషయాలను కూడ నాయకత్వం గుర్తించనుంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో మండలాల వారీగా నేతల నుండి పీసీసీ నాయకత్వం అభిప్రాయాలను సేకరించనుంది. ఎవరిని అభ్యర్ధిగా బరిలోకి దింపితే బాగుంటుందనే విషయమై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను సేకరించనుంది.

ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై కాంగ్రెస్ నాయకత్వం ఆరా తీస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా నేతృత్వంలో పార్టీ నేతలు  అభ్యర్ధి కోసం ఆరా తీశారు.మరో వైపు మాజీ ఎంపీ విజయశాంతి కూడ ఈ స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. 

రెండు మూడు రోజుల్లో ఈ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించాలని పీసీసీ నాయకత్వం భావిస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాని వైనాన్ని ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.