హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాయి.

అనారోగ్యంతో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గత నెలలో మరణించాడు. దీంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ఇదివరకే ప్రకటించారు.

తెలంగాణ జనసమితి కూడ ఈ స్థానం నుండి పోటీ చేయాలని కసరత్తు చేస్తోంది.ఈ విషయమై కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ జనసమితి పోటీ విషయమై ప్రకటన చేయనుంది.

బీజేపీ తరపున రఘునందన్ రావును మరోసారి ఆ పార్టీ బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడ నెలకొన్నాయి.గతంలో ఇదే స్థానంలో రఘునందన్ రావు పోటీ చేశారు. ఈ దఫా కూడ ఆయననే బరిలోకి దింపడం ద్వారా మెరుగైన ఫలితాన్ని దక్కించుకోవచ్చని కమలదళం భావిస్తోంది. రఘునందన్ రావు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించినట్టుగా చెబుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం  దామోదర రాజనర్సింహ్మ నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో బరిలోకి దింపే అభ్యర్ధి కోసం ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది.

టీఆర్ఎస్ తరపున రామలింగారెడ్డి కుటుంబసభ్యుల్లో ఎవరినో ఒకరిని బరిలోకి దింపే అవకాశం ఉంది. రామలింగారెడ్డి కొడుకు లేదా ఆయన భార్యను బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రామలింగారెడ్డి భార్య వైపే టీఆర్ఎస్ నాయకత్వం మొగ్గు చూపుతోందనే ప్రచారం కూడ ఉంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.టీఆర్ఎస్ నేతలకు ఇప్పటికే మండలాలకు ఇంఛార్జీలను నియమించారు. తమకు కేటాయించిన మండలాల్లో టీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు.

మరోవైపు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయశాంతి పోటీ చేస్తారనే ప్రచారం కూడ సాగుతోంది. గతంలో మెదక్ నుండి విజయశాంతి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. దీంతో దుబ్బాకలో పోటీ చేస్తే  మెరుగైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

సాధారణంగా ఉప ఎన్నికల్లో ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫలితాలు తారుమారైన సందర్భాలు ఉన్నాయి.