హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్ధి విషయంలో టీఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పులు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గంలో  ఇద్దరు కీలక నేతలు వరుసగా మరణించడంతో ఎవరికి టిక్కెట్లు కేటాయిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో  కొందరు టీఆర్ఎస్ నేతలు రహస్యంగా సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాలు ప్రస్తుతం టీఆర్ఎస్ లో చర్చకు దారితీస్తున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి బతికున్న సమయంలో నలుగురైదుగురు నేతల మాటలు విని తమను పట్టించుకోవడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. 

also read:దుబ్బాక ఉప ఎన్నిక: అభ్యర్థుల వేటలో ప్రధాన పార్టీలు

రహస్య సమావేశం నిర్వహించిన నేతలు  ఇప్పటివరకు తాము పడిన బాధలను ఏకరువు పెట్టినట్టుగా సమాచారం.దుబ్బాక మండల కేంద్రంలో టీఆర్ఎస్ అసమ్మతి నేతలు సమావేశం కావడం చర్చించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత అనారోగ్యంతో ఆయన మరణించాడు. దీంతో ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని టీఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చింది. అయితే గత నెల 6వ తేదీన సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించాడు. 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి టిక్కెట్టు కేటాయించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.

చెరుకు ముత్యం రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని టీఆర్ఎస్ కీలక నేతలు హామీ ఇచ్చారు. దీంతో చెరుకు ముత్యం రెడ్డితో పాటు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులను కట్టబెట్టాలని గులాబీ నాయకత్వం భావిస్తోందని సమాచారం.

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టిక్కెట్టు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది.