తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీ.కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని హైకోర్టుకు తెలపడాన్ని రాములమ్మ ఖండించారు. సోమవారం తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా స్పందించిన ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన పిటీషన్ లో, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతిపక్షాలు, కార్మిక సంఘ నేతలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని, టిఆర్ఎస్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉంది.

ఏ కుట్రలు జరగకుండానే, తెలంగాణలో ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా కుట్ర చేసింది కేసీఆర్ గారే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Alsp Read:2 వారాల్లో తేల్చండి: ఆర్టీసీపై లేబర్‌ కమిషనర్‌‌కు హైకోర్టు ఆదేశం

మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి, విలువలకు తిలోదకాలిచ్చిన కూడా కేసీఆర్ గారే. కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయన పక్కన ఉన్న వారు కుట్ర చేస్తే, ఆ నిజాన్ని బయట పెట్టలేక.. ప్రతిపక్షాల మీదకు ఆ నెపాన్ని నెట్టి వేసేందుకు దొరగారు ప్రయత్నిస్తున్నారు అనే అనుమానం కలుగుతోంది.

దీనికి కారణం లేకపోలేదు. టిఆర్ఎస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు... కొందరు మంత్రులు కూడా తమతో టచ్ లో ఉన్నారని... త్వరలో వాళ్ళు కెసిఆర్ గారి మీద తిరుగుబాటు చేసి, బిజెపిలో చేరుతారని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ గారు ఈ మధ్యనే ప్రకటన చేశారు.

Also Read:ప్రభుత్వాన్ని విపక్షాలు కూలుస్తాయి: సునీల్ శర్మను డిస్మిస్ చేయాలన్న ఉత్తమ్

ఒకవేళ ఈ ప్రకటనను చూసి, బెంబేలెత్తి పోయిన కేసీఆర్ గారు... బిజెపి పేరును ప్రస్తావించడానికి భయపడి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని తన ఆందోళనను కోర్టు ద్వారా తెలియపరిచి ఉంటారు.

ఇంతకీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నది ఎవరు? ఆ పేర్లను బయట పెట్టేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? ఆ కుట్రలో మంత్రులు ఉన్నారా? ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలిస్తే... సీఎం సీటు కోసం పోటీ పడే దెవరు? ఈ అనుమానాలకు కెసిఆర్ గారి నుంచే సమాధానం రావాలి’’ అని ఆమె కోరారు.