Telangana Local Body Elections: తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి పోటీ చేయనుంది. ఎన్నికల పర్యవేక్షించడానికి మంత్రుల కమిటీ ఏర్పాటైంది,  

Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక ఎన్నికలను సెప్టెంబర్ 30లోపల నిర్వహించాలనే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా? అని రాష్ట్ర ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా స్థానిక సమరంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ వడివడిగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. వ్యూహా ప్రతి వ్యూహాలతో ఎన్నికల బరిలో నిలువాలని సీఎం రేవంత్ సేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ తెలంగాణలో స్థానిక సమరం ఎప్పుడు? బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సరికొత్త వ్యూహమేంటీ?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అనే అంశం ముందుకు వస్తుంది. అయితే.. ఈ రిజర్వేషన్ ను అధికారికంగా అమలు చేసి, ఎన్నికలకు వెళ్లడం సాధ్యంకాదని భావిస్తుంది. ఈ తరుణంలో పార్టీపరంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి PAC (Political Affairs Committee)సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన PAC, అడ్వైజరీ కమిటీ సమావేశంలో సభ్యులు రిజర్వేషన్ల అమలు, స్థానిక ఎన్నికల వ్యూహాలపై నేతలు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఇంకా రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పార్టీ ఈ రిజర్వేషన్లను పార్టీ స్థాయిలో అమలు చేసి స్థానిక ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.

సమావేశంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిధుల పరిస్థితి, కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చే నిధుల ఆలస్యం, బీసీల కోసం ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చ సాగింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల గత ఆర్థిక ఏడాదిలో కేంద్రం నుండి రావాల్సిన రూ.1,570 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితిలో అధికారికంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు చేయలేనందున, పార్టీపరంగా ముందుకు వెళ్లడం అవసరమని కొందరు నేతలు సూచించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరగడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి బలోపేతం కలిగే అవకాశం ఉంటుందని కూడా నేతలు పేర్కొన్నారు.

PAC సమావేశంలో నాలుగు గంటల చర్చ తరువాత, పార్టీ స్థాయిలో రిజర్వేషన్ల అమలుపై న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించబడింది. 28వ తేదీ లోపులో PAC నివేదికను ప్రభుత్వానికి, పార్టీకి అందజేయనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని బీసీల రిజర్వేషన్ల అంశంపై తుది నిర్ణయం తీసుకుంటాం. 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి, కేబినెట్ పాల్గొని ప్రజల హక్కులను కాపాడటంలో ప్రభుత్వ సమగ్ర భాగస్వామ్యం చూపించనున్నారు”అని తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అమలు, ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించడానికి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో మంత్రుల కమిటీని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఆగస్టు 29న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వెలువడే అవకాశం ఉంది. పార్టీ నేతలు, ఎన్నికల ప్రక్రియ సకాలంలో పూర్తి అయ్యేలా చర్చలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.