తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదని .. కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందేమో అని తమ్మినేని ఎద్దేవా చేశారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు రాష్ట్ర సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మంగళవారం కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్ధుల జాబితాను కేసీఆర్ ఏకపక్షంగా ప్రకటించారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ పదే పదే చెప్పారని తమ్మినేని తెలిపారు. తాము కోరిన సీట్లలో కూడా అభ్యర్ధులను ప్రకటించారని వీరభద్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదని .. కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందేమో అని తమ్మినేని ఎద్దేవా చేశారు. 

ALso Read: రాజకీయాలంటే మోసమేనా... లెఫ్ట్ పార్టీలంటే ఏంటో చూపిస్తాం : కేసీఆర్‌కు కూనంనేని వార్నింగ్

కేసీఆర్ రాజకీయ విధానంతో సమస్య వచ్చిందని.. తమతో చర్చలకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు, ఇండియా, ఎన్డీయే కూటమికి దూరంగా వున్నామన్నారని వీరభద్రం చెప్పారు. మీ వైఖరి మాకు నచ్చలేదని చెప్పారని తమ్మినేని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో విభేదాలు వున్నాయి.. ఐనా బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో కలిశామని వీరభద్రం తెలిపారు. ఇండియా కూటమిలో వుండటం నచ్చలేదని చెప్పారని ఆయన వెల్లడించారు. తమకు కేరళలో కాంగ్రెస్‌తో విభేదాలు వున్నాయని.. కానీ బీజేపీ ఓటమి కోసం కాంగ్రెస్‌తోనే వున్నామని వీరభద్రం వెల్లడించారు. రాజకీయ విభేదం ఏంటని కేసీఆర్ వివరణ ఇవ్వాలని.. తమతో కలిసి వచ్చే వారితో పనిచేస్తామని తెలిపారు. 

అంతకుముందు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో మద్ధతు ఇవ్వాలని కేసీఆర్ కోరారని అన్నారు. బీజేపీ దూకుడుని మునుగోడులో నిలువరించాలనేది అప్పుడు తమ విధానమని కూనంనేని చెప్పారు. బీజేపీతో ఎక్కడో ఓ పాయింట్ వద్ద కేసీఆర్‌కు సఖ్యత వచ్చినట్లుగా తాము గ్రహించామని అన్నారు. బీజేపీతో ఇప్పుడు కేసీఆర్‌కు ప్రమాదం వుందా , లేదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో అప్పుడు లేని సఖ్యత ఇప్పుడు బీఆర్ఎస్‌కు వుందా అన్న ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు.

తమతో ఇప్పుడు పొత్తు పెట్టుకోనంత మాత్రాన తమకు వచ్చిన నష్టం ఏం లేదని సాంబశివరావు స్పష్టం చేశారు. ఆ పార్టీలు ఎంతకాలం వుంటాయో తమకు తెలియదని.. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను మనసా వాచా నమ్మి నడుచుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రత్యేక పరిస్ధితుల్లోనే అప్పుడు బీఆర్ఎస్‌కు మద్ధతు ఇచ్చామని కూనంనేని స్పష్టం చేశారు. బీజేపీకి దగ్గరయ్యుంటే కనీసం మిత్రధర్మం పాటించవా , కనీసం స్నేహధర్మం, రాజధర్మం వుండదా అని సాంబశివరావు ప్రశ్నించారు.